2026లో తమిళనాట పోటీ
● పుదుచ్చేరి సీఎం రంగస్వామి
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో తాము పోటీ చేస్తామని ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, పుదుచ్చేరి సీఎం రంగస్వామి ప్రకటించారు. ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావడంతో ఆవిర్భావ వేడుకను శుక్రవారం ఈసీఆర్ మార్గంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం రంగస్వామి హాజరయ్యారు. పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందే విధంగా పాలన సాగిస్తున్నట్టు వివరించారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని గుర్తుచేస్తూ, 2026 ఎన్నికలలో మళ్లీ పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో ఒక్క పుదుచ్చేరిలోనే కాకుండా తమిళనాడులో సైతం ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు. కర్మయోగి కామరాజర్ సిద్ధాంతాలను అనుసరిస్తూ, ఆయన ఆదర్శంగా ముందుకు సాగుతున్న ఎన్‌ఆర్ కాంగ్రెస్ తమిళనాడులో పోటీ చేయాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని వివరించారు. ఇందుకు అనుగుణంగా తమిళనాడులో తమ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment