![అంతా రాజకీయ కారణాలే!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07cni23-600560_mr-1738982639-0.jpg.webp?itok=58jH4Drr)
అంతా రాజకీయ కారణాలే!
● వీసీల ముసాయిదాపై కోర్టుకు గవర్నర్ వివరణ ● అడ్డుకట్ట వేయడం సమంజసమేనా?
సాక్షి, చైన్నె: రాజకీయ కారణాలతోనే వీసీల వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం ముసాయిదాలను అసెంబ్లీలో ఆమోదించి పంపించినట్టు సుప్రీంకోర్టుకు రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి తరఫున వివరణ చేరింది. అదే సమయంలో ముసాయిదాలకు అడ్డుకట్ట వేయడం సమంజసమేనా అని గవర్నర్ తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు.
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య జరుగుతున్న అధికార సమరం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. వీసీల నియామకం, వర్సిటీల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ విచారణ గత రెండు రోజులుగా సుప్రీంకోర్టులో జరుగుతోంది. తొలి రోజు వాడీవేడిగా వాదనలు సాగాయి. న్యాయమూర్తులు సంధించిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గవర్నర్ తరఫున శుక్రవారం వివరణ సుప్రీంకోర్టుకు చేరింది.
రాజకీయ కారణాలతోనే ఈ ముసాయిదాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కోర్టుకు వివరించారు. గవర్నర్‌కు ఉన్న అధికారం మేరకు ముసాయిదాలకు అనుమతి ఇవ్వకుండా, రాష్ట్రపతికి పంపించేందుకు అవకాశం ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర హక్కులను కాలరాసే విధంగా ఎలాంటి నిర్ణయాలను గవర్నర్ తీసుకోవడం లేదని వివరించారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా వీసీల నియామకం వ్యవహారం ఉందని, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ముసాయిదా ఉందని గవర్నర్ తరఫున న్యాయవాదులు వాదనను వినిపించారు. అదే సమయంలో న్యాయమూర్తులు స్పందిస్తూ, వ్యతిరేకంగా ఉందంటూ కాలయాపన చేస్తే, ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయని ప్రశ్నించారు. గవర్నర్‌లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు కొత్తేమీ కాదని, అయితే, గవర్నర్‌కు ఉన్న అధికారాలు నాలుగేనని గుర్తుచేశారు. ఒక ముసాయిదాను ఆమోదించడం లేదా ఆపడం లేదా వెనక్కి పంపించడం లేదా, అసంతృప్తిని వ్యక్తం చేయడం విధిగా పేర్కొన్నారు. ముసాయిదాను రాష్ట్రపతికి పంపించే సమయంలో ఎందుకు పంపించామో అనే కారణాలను వివరించాల్సిన అవసరం ఉందని, ఏదో ఒక కారణం చెప్పకుండా పంపిస్తే, వాటి గురించి రాష్ట్రపతి స్వయంగా తెలుసుకోవాలా అని ప్రశ్నించారు. వాడీవేడిగా సాగిన వాదనల అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ, ముసాయిదాకు అడ్డుకట్ట వేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment