![అమ్మ బాటలో పళణి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07cni28-600560_mr-1738982640-0.jpg.webp?itok=1eNcy8wV)
అమ్మ బాటలో పళణి
● రైతు సత్కార వేడుక రేపు
సాక్షి, చైన్నె: దివంగత సీఎం, అమ్మ జయలలిత మార్గంలో తన రాష్ట్ర పర్యటనకు పళణి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివారం జరిగే రైతు సత్కార వేడుక తర్వాత ప్రచార పర్యటన షెడ్యూల్‌ను పళని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 2026 ఎన్నికల ద్వారా అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ కేడర్‌ను ఏకం చేస్తూ ప్రచార పర్యటనకు రెడీ అవుతున్నారు. గత నెలాఖరు నుంచి రాష్ట్ర పర్యటనకు పళణి నిర్ణయించారు. అయితే, ఫీల్డ్ సర్వే ప్రక్రియ ముగియడంలో జాప్యంతో ఫిబ్రవరి మొదటి వారానికి పర్యటనను మార్చారు. అదే సమయంలో రైతు సంఘాల సత్కార వేడుక ఆహ్వానం అందడంతో ఈనెలాఖరు నుంచి రాష్ట్ర పర్యటన దిశగా పళని సిద్ధమవుతున్నారు. ఆదివారం అన్నూరులో రైతు సంఘాల నేతృత్వంలో జరగనున్న బ్రహ్మాండ సత్కార బహిరంగ సభలో పళణిస్వామి తన పర్యటన గురించి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పతనం లక్ష్యంగా అప్పట్లో అమ్మ జయలలిత అనుసరించిన వ్యూహాలను ఆచరించే విధంగా ప్రజా పర్యటనకు పళణి రెడీ అవుతున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అత్తి కడవు అవినాశి ఉమ్మడి నీటి పథకం సాధనలో పళణి స్వామి కృషిని గుర్తించి రైతు సంఘాలు సత్కార వేడుకకు పిలుపు నిచ్చాయి. నేపథ్యంలో అప్పట్లో ఈ పథకం అమలుకు అమ్మ జయలలిత తీసుకున్న నిర్ణయాలు, ఆ తర్వాత ఆమె రాష్ట్ర పర్యటన దిశగా సాగిన కార్యాచరణను అస్త్రంగా చేసుకుని తాను సైతం రూట్ మ్యాప్‌ను పళణి సిద్ధం చేసుకుని ఉండడం గమనార్హం. కోయంబత్తూరు నుంచి ఈ పర్యటన ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment