►మానసిక ఒత్తిడిని తగ్గించే మాత్రల వినియోగం ఒక ఏడాది కాలంలోనే రూ.40 కోట్లకు పైగా పెరగడం సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది.
►మానసిక సమస్యల నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్లు, కౌన్సెలింగ్ సెంటర్లకు ఫోన్ల తాకిడి గణనీయంగా పెరిగింది.
సాక్షి, హైదరాబాద్: ప్రజల మానసిక ఆరోగ్యంపై కోవిడ్–19 తీవ్ర ప్రభావం చూపించింది. మొదటి దశలో ప్రారంభమైన ఈ సమస్య.. రెండో దశలో మరింత తీవ్రమయ్యింది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటం, పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు వంటివన్నీ భయాందోళనలకు కారణమయ్యాయి. కరోనా పరిస్థితుల్లో వైరస్ బారినపడిన వారితో పాటు పడని వారిలో కూడా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆదుర్దా వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ మహమ్మారి మొదలయ్యాక గతేడాది కాలంలో యాంటీ డిప్రెసెంట్ (ఒత్తిడిని తగ్గించేవి) మాత్రల వినియోగం దాదాపు 25 శాతం దాకా పెరగడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా 9 లక్షలకు పైగా ఫార్మసిస్ట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఆరిజిన్ కెమిస్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌కు చెందిన పరిశోధక బృందం జరిపిన పరిశీలనలో.. భారత మార్కెట్‌లో అతి ఎక్కువగా అమ్ముడయ్యే ఐదు యాంటీ డిప్రెసెంట్ ట్యాబ్లెట్ల అమ్మకాలు 2020 ఏప్రిల్‌లో రూ.177 కోట్లు (వార్షిక వినియోగం) ఉంటే, తదుపరి ఏడాదిలో అంటే 2021 ఏప్రిల్ నాటికి రూ.218 కోట్లకు పెరిగినట్లు తేలింది.
మరోవైపు దేశవ్యాప్తంగా మానసిక శాస్త్రవేత్తలు, నిపుణులు, సైకాలజిస్ట్‌లు వెల్లడిస్తున్న అంశాలు కూడా ఈ గణాంకాలకు బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి. గతంతో పోల్చితే కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో భయం, ఆందోళన, ఆదుర్దా, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలతో తమను ఫోన్లో, ఇతరత్రా సంప్రదిస్తున్నవారు (డైలీ డిస్ట్రెస్ కాల్స్) అంతకుముందుతో పోల్చుకుంటే గత ఒక్క (మే) నెలలోనే 40 శాతం దాకా పెరిగినట్టు వారు చెబుతున్నారు. వైరస్ బారినపడినవారు కరోనా నుంచి కోలుకునే క్రమంలో ఎదురయ్యే ఆరోగ్యం, ఇతర సమస్యలతో కుంగుబాటు, ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు మహమ్మారి తీవ్రంగా విరుచుకు పడడం వల్ల ఎదురయ్యే సమస్యలు, కుటుంబసభ్యులు..ఆప్తులు మరణించడం, ఉద్యోగం కోల్పోవడం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం వంటి వాటితో మానసిక ఆరోగ్యం దెబ్బతిని, ఒత్తిళ్లకు గురై మరో వర్గం ప్రజలు మానసిక నిపుణులను సంప్రదిస్తున్నారు. దాదాపు నెలన్నర క్రితం గాంధీ మెడికల్ కాలేజీ సైకియాట్రీ విభాగం వివిధ వర్గాల కోవిడ్ రోగులపై నిర్వహించిన అధ్యయనం.. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి పేషెంట్లకు శారీరక స్వస్థత చేకూర్చే వైద్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపరిచే చికిత్స అందించాల్సిన అవసరముందని సూచించింది. ఈ పరిస్థితిపై సైకియాట్రిస్ట్ డాక్టర్ నిషాంత్ వేమన, సీనియర్ సైకాలజిస్ట్ సి.వీరేందర్ తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. తమను సంప్రదిస్తున్న వారికి కౌన్సెలింగ్‌లో భాగంగా పరిష్కార మార్గాలు, సమస్య తీవ్రతను బట్టి మందులు సూచిస్తున్నట్లు వారు తెలిపారు.
పిల్లల గురించీ ఆందోళన
రెండు దశల కరోనా, బ్లాక్ ఫంగస్ కేసులు, ఒంటరితనం, ఇంట్లో ఒకేచోట ఏడాదికి పైగా నిరాశ, నిస్పృహల మధ్య గడపడం, ఎక్కడ కోవిడ్ సోకుతుందోనన్న భయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడం వంటి వాటి వల్ల చాలా మందిలో ఆదుర్దా, ఆందోళన, కుంగుబాటు సమస్యలు తలెత్తాయి. దీంతో ఫోన్లలో లేదా స్వయంగా సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లను సంప్రదిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మొదటి దశలోనైతే ఆత్మహత్యల వంటివి కూడా చోటుచేసుకున్నాయి. ఇక కోవిడ్ తగ్గిపోయాక కూడా ఆరోగ్యం పూర్తిస్థాయిలో కుదుటపడక పోవడం, ఒళ్లునొప్పులు, చురుకుదనం లేకపోవడం, నీరసం వంటి సమస్యలతో ఒత్తిడికి గురవుతూ మా దగ్గరకు వస్తున్నారు. జ్ఞాపకశక్తి సమస్యలు, పనిమీద ఏకాగ్రత కొరవడడం, ఉత్పాదకత తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా మా దృష్టికి తీసుకువస్తున్నారు. థర్డ్‌వేవ్ వస్తే పిల్లలపై ఎక్కువ ప్రభావం పడుతుందా, పిల్లలను స్కూళ్లకు పంపొచ్చా లేదా అన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు.
– డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
సమస్యల భారం.. భవిష్యత్ బెంగ
చుట్టూ భయం, ఆందోళనతో కూడిన పరిస్థితులు ఉన్నపుడు మెజారిటీ ప్రజల్లో గందరగోళం, ఎటూ తోచని స్థితి ఏర్పడుతుంది. దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతున్న కరోనా ఉధృతి కారణంగా ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన బంధాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, కింది తరగతి వారిని ఈ పరిణామాలు కోలుకోలేని దెబ్బతీశాయి. దిగువ మధ్యతరగతికి చెందిన పలువురి ఉద్యోగాలు, ఉపాధి పోవడంతో ఆర్థికస్థితి దిగజారి కింది తరగతికి చేరుకున్నారు. కరోనాకు ముందే దేశంలో 20 నుంచి 30 కోట్ల మంది దారిద్య్రంలో మగ్గుతున్నారు. కోవిడ్ ప్రభావం, తదనంతర పరిణామాల కారణంగా మరో 40 కోట్ల మంది దారిద్య్రంలోకి ప్రవేశించినట్టు ‘ఇండియన్ ఎకనమిక్ ఫోరం’అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగం కోల్పోవడం, నెలవారీ వచ్చే ఆదాయం రాక దాచుకున్న కొంత డబ్బు ఖర్చయిపోవడం, నెల నెలా కట్టాల్సిన ఈఎంఐల భారం పెరిగిపోవడం.. వీటికి తోడు కుటుంబం కరోనా బారిన పడటం వంటి అంశాలు పెనుప్రభావం చూపాయి. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి నుంచి ఎలా బయటపడాలి? అన్న ఆందోళన, భవిష్యత్ గురించిన భయం వెరసి మానసిక ప్రశాంతత, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆర్థిక సమస్యలతో కుటుంబాల్లో కీచులాటలు, ఇంటి సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినడం మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి.
– సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment