సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ సంస్థకు చెందిన ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్‌లో దిగ్గజ సంస్థ డీఏజెడ్‌ఎన్ నిర్ణయించింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా యూకేలో పర్య టిస్తున్న మంత్రి కేటీఆర్‌ను శనివారం డీఏజెడ్‌ఎన్ గ్రూప్ ఉన్నతాధికారులు సందీప్ టికు, వెల్స్ కలిసి చర్చలు జరిపారు. అనంతరం కంపెనీ తెలంగాణలో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేసింది.
అంతర్జాతీయ ఓటీటీ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్విస్ సంస్థ డీఏజెడ్‌ఎన్‌కు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల సబ్‌స్రై్కబర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు అత్యధికంగా వీక్షించే యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్, యూరప్ లీగ్, సీరీ ఏ, లా లిగా, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, ఎన్‌ఎఫ్‌ఎల్, ఎన్‌బీఏతోపాటు ఐపీఎల్ (భారత్ మినహా) వంటి ప్రధాన ఈవెంట్ల లైవ్, ఆన్–డిమాండ్ స్పోర్ట్స్ కంటెంట్‌ను డీఏజెడ్‌ఎన్ ప్రసారం చేస్తుంది.
తమ పెట్టుబడులతో తెలంగాణ యువతకు 1,000 ఉద్యోగాలు వస్తాయని కంపెనీ తెలిపింది. ఇన్నొవేషన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న ఆధిపత్యానికి డీఏజెడ్‌ఎన్ పెట్టుబడే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment