వివిధ రకాల జంతువుల ఆకృతులు
సాక్షి, సిద్దిపేట: దేశంలో ఉన్న అటవీప్రాంతాలు, వివిధ రకాల కర్రలు, నేలల రకాలు అన్నీ ఒకే దగ్గర తిలకించేవిధంగా ఏర్పాటు చేశారు. అది ఎక్కడో అనుకుంటున్నారా! ఎక్కడో కాదు.. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో(ఎఫ్‌ఆర్‌సీఐ) ఏర్పాటు చేసిన మ్యూజియంలో కొలువుదీరాయి. 52 ఎకరాల్లో ఏర్పాటుచేసిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో బీఎస్సీ ఫారెస్ట్ నాలుగేళ్లు, ఎమ్మెస్సీ ఫారెస్ట్ రెండేళ్ల కోర్సులు కొనసాగుతున్నాయి.
విద్యార్థులు, అధ్యాపకులు రెండేళ్లపాటు అడవులను సందర్శించి వీటిని సేకరించారు. ప్రజలకు దేశంలో అటవీప్రాంతాలు, నేలల రకాలపై అవగాహన కోసం మ్యూజియం రూపొందించారు. మ్యూజియంలోకి వెళ్లగానే అడవిలోకి వెళ్లినట్లుగా ఉండే విధంగా వివిధ రకాల జంతువుల బొమ్మలు, చెట్లు ఏర్పాటు చేశారు.
భూములు... అడవులు
మ్యూజియంలో ఎన్నో అంశాలు తెలుసుకునేవిధంగా ఏర్పాటు చేశారు. దేశంలో భూములు, పంటల రకాలు, రాష్ట్రంలోని అడవుల గురించి తెలిసే విధంగా చిత్రాలను ఉంచారు. తడి ఆకులు, పొడి ఆకురాల్చు, ముళ్ల అడవులు, పొడి సతత హరితారణ్యాలకు సంబంధించి వాటి స్వరూపాన్ని తెలిపే అంశాలను లిఖించారు. రాష్ట్ర వృక్షం జమ్మి, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పుష్పం తంగేడు, రాష్ట్రపక్షి పాలపిట్టలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు చిత్రాలను ఏర్పాటు చేశారు. శిల్పాలు, ఖనిజాలు, శిలాజాలు, మృత్తికలు చిత్రరూపంలో ఉన్నాయి.
జంతువుల పాదాల అచ్చులు
ఏ జంతువు పాదం అచ్చు ఏ విధంగా ఉంటుందో ఫొటోలతో ఏర్పాటు చేశారు. జింక, పులి, నీటి ఏనుగు, సింహం, చిరుత, ఎలుగుబంటి, నక్క, ఏనుగుల పాదాల అచ్చులను ఏర్పాటు చేశారు. కప్పకు సంబంధించిన లైఫ్ సర్కిల్‌ను ఫొటోల రూపం ఏర్పాటు చేశారు. సాధారణంగా నాలుగు, ఐదు రకాల సీతాకోక చిలుకలనే మనం చూసి ఉంటాం. అదే ఫారెస్ట్ కళాశాల మ్యూజియంలో 32 రకాల సీతాకోక చిలుకలు, 10 రకాల గొల్లభామలు, మిడతలు, తేనెటీగలు ఉన్నాయి.
సాయిల్ ప్రొఫైల్
భూముల్లో ఎన్ని పొరలు ఉంటాయి. ఏవిధంగా ఉంటాయో తెలియదు. అందరికీ తెలిసేవిధంగా ఫారెస్ట్ కళాశాలలో సాయిల్ ప్రొఫైల్ ఏర్పాటు చేశారు. భూమిలో ఐదుపొరలు ఉండనున్నాయి. అవి ఆర్గానిక్ ఆరిజన్, టాప్ సాయిల్, సబ్ సాయిల్, రాక్ ప్రాంగ్‌మెంట్స్, బెడ్‌రాక్‌లు ఉన్నాయి. ఇవన్నీ గాజుపాత్రలో ఏర్పాటు చేశారు.
కర్రల సమూహం
తెలంగాణలో చాలారకాల చెట్లను నరికి తయారు చేసిన కర్రల చెక్కలను గృహ అవసరాలకు వినియోగిస్తుంటారు. ఈవిధంగా ఉపయోగించే 17 రకాల చెట్లకు సంబంధించిన చెక్కలను మ్యూజియంలో ఏర్పాటు చేశారు. టేకు, బండారు, తుమ్మ, సీసం, తెల్లమద్ది, ఇప్ప, కరక్కాయ, చిల్ల, కానుగ, ఇప్ప, రోజ్‌ఉడ్, మిత్రదైనా, గుంపెన, లాటిణోలియా, గ్జలేలియా, తునికి, నారెప్పల చెట్టుకు సంబంధించిన కర్ర చెక్కలున్నాయి. వివిధ రకాల కర్రలతో తయారు చేసిన చెక్క బొమ్మలు, వివిధ ఆకృతులు మ్యూజియంలో ఉన్నాయి.
రెండేళ్లు పట్టింది ఇవన్నీ సేకరించేందుకు..
డాక్టర్ కపిల్ సిహాద్‌తోపాటు మరో ఇద్దరు ప్రొఫెసర్లు రెండేళ్లపాటు తెలంగాణలోని అన్ని అటవీ ప్రాంతాల నుంచి సేకరించారు. దేశంలో, రాష్ట్రంలో అటవీప్రాంతాలు, వివిధ రకాల కర్రలు, జంతువులు, నేలల రకాల గురించి అందరికీ తెలిపేందుకే ఈ మ్యూజియం ఏర్పాటు చేశాం. పాఠశాల విద్యార్థులు ప్రతి నెలా ఫీల్డ్ విజిట్‌లకు వెళ్తుంటారు. అలా వెళ్లేవారు ఎఫ్‌సీఆర్‌ఐలో ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తే ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.
– వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఆర్‌సీఐ డిప్యూటీ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment