సాక్షి, హైదరాబాద్: కరోనా రెండోసారి వచ్చే అవకాశాలు 0.04 శాతం మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఖతార్ దేశ విభాగం వెల్లడించింది. అంటే ప్రతీ 10 వేలమందిలో నలుగురికి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. కరోనా రెండోసారి వస్తుందా లేదా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. రెండోసారి కేసులు అక్కడక్కడ నమోదవు తున్నాయంటూ హాంకాంగ్, అమెరికా వంటి దేశాల్లో ప్రచారం జరుగుతోంది. మన రాష్ట్రంలోనూ రెండు కేసులు నమోదయ్యా యని ఇక్కడి వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఎక్కడా దీనిపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగలేదు. తాజాగా డబ్ల్యూహెచ్‌వో ఖతార్ విభాగం, ఆ దేశ ప్రజారోగ్యశాఖ, ఖతార్ కార్నెల్ యూని వర్సిటీలు దీనిపై సంయుక్తంగా పరిశోధన చేశాయి. ఈ వివరాలు ‘మెడ్ ఆర్ యక్స్ ఐవీ జర్నల్’లో రెండ్రోజుల క్రితం ప్రచురిత మయ్యాయి. 1,33,266 మంది కరోనా వచ్చి.. పోయిన రోగులపై ఈ పరిశోధన చేశారు. వారికి 45 రోజుల తర్వాత మళ్లీ ఆర్‌టీ–పీసీఆర్ చేశాక, అందులో 54 మందికి తిరిగి పాజిటివ్ వచ్చిందని నిర్ధారణకు వచ్చారు. తిరిగి పాజిటివ్ వచ్చిన 54 మందిలో 41 శాతం మందికి కొద్దిపాటి లక్షణాలున్నట్లు కనుగొన్నారు. మరో 58 శాతం మందికి ఏ లక్షణాలు లేవు. ఒకరు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందారు.
45 రోజుల వరకు కొందరిలో డెడ్ వైరస్
ఖతార్.. అరేబియా గల్ఫ్ ప్రాంతంలో 28 లక్షల జనాభా కలిగిన ద్వీపకల్పం. యాంటీ బాడీ పరీక్షలు, ఇతర సీరో సర్వేల ద్వారా దేశ జనాభాలో సగం మంది ఇప్పటికే వైరస్ ప్రభావానికి గురైనట్లు తేలింది. అక్కడ మే నాటికే కరోనా తీవ్రరూపం దాల్చింది. వైరస్ ఎందుకింత వేగంగా విస్తరిస్తుందో అంతు బట్టక ఆ దేశ ప్రజారోగ్యశాఖ, శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా, అక్కడ వైరల్ లోడ్ చాలా ఎక్కువని తేలింది. దీంతో కరోనా వచ్చి పోయిన వాళ్లకే మళ్లీ పరీక్షలు చేశారు. కొందరికైతే వచ్చిపోయిన 45 రోజుల్లోగా పరీక్షచేస్తే వారిలో మళ్లీ పాజిటివ్ వచ్చింది. అలా 15,808 మందికి తిరిగి పాజిటివ్ వచ్చింది. అయితే వీరిలో డెడ్ (చనిపోయిన) వైరస్ ఉందని నిర్ధారించారు. డెడ్ వైరస్ ఉండి ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారిలో సైకిల్ థ్రిషోల్డ్ వ్యాల్యూ (సీటీ వ్యాల్యూ) 30 కంటే ఎక్కువగా ఉంది. అంటే అది డెడ్ వైరస్ అని నిర్ధారణకు వచ్చారు. కొన్నాళ్ల తర్వాత వారికి నెగెటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో రీఇన్ఫెక్ట్‌కు సంబంధించిన పరిశోధనకు 45 రోజులను కటాఫ్‌గా పరిగణించి పరిశోధన చేశారు.
రెండోసారి రావడం అత్యంత అరుదు
రీఇన్ఫెక్ట్ అయిన 54 మందిలో సీటీ వ్యాల్యూ 25 కంటే తక్కువుంది. అంటే వైరస్ మళ్లీ వారిలో వచ్చినట్లు గుర్తించారు. అయితే 0.04 శాతం మంది రీఇన్ఫెక్ట్ కావడం అత్యంత తక్కువ. 10 వేల మందిలో నలు గురికి రావడం అత్యంత అరుదైన విషయం. ఒక వేళ రెండోసారి సోకిన 54 మందిని పరిశీలిం చినా వారంతా సురక్షితంగా ఉన్నారని ఈ అధ్య యనం తెలిపింది. వీరిలో సగం మందికి యాంటీ బాడీస్ రాలేదు. మిగిలిన వారికి తీవ్రమైన జబ్బులేమీ లేవు. కాబట్టి రెండోసారి వస్తుంద నేది పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం కాదని తెలిపింది. అయితే దీనిపై తదుపరి జన్యు పరిశోధన చేసి.. మరోసారి రావడానికి గల కారణాలను సమగ్రంగా విశ్లేషించవచ్చని తెలిపింది. మొదటిసారి వైరస్ వచ్చిపోయాక రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని, అది కనీసం కొన్ని నెలల వరకు ఉంటుందని ఈ కొత్త పరిశోధన పేర్కొంది.
అరుదని తేల్చిన పరిశోధన
ఐసీఎంఆర్ చెప్పినట్లు వైరస్‌లలో రీఇన్ఫెక్షన్ అరుదు. అలా అని రాదని చెప్పలేం. వ్యాక్సిన్ల వల్ల కూడా కొంతమందిలో రియాక్షన్, మరికొందరిలో పనిచేయకపోవడం చూస్తుంటాం. అలా అని వ్యాక్సిన్లు వ్యర్థం అనలేం కదా. హాంకాంగ్‌లో నమోదైన రీ ఇన్ఫెక్షన్ కేసు 5 నెలల తర్వాత వెలుగుచూసింది. అదీ యాదృచ్ఛికంగా బయటపడింది. ఆ వ్యక్తిలో యాంటిబాడీస్ పుష్కలంగా ఉన్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వైరస్ రెండోసారి సోకడం అరుదని ఖతార్ పరిశోధన తేల్చిచెప్పింది.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిజామాబాద్
కరోనా రెండోసారి వచ్చే అవకాశాలు ఎంతంటే..!
Published Mon, Aug 31 2020 1:20 AM | Last Updated on Mon, Aug 31 2020 11:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment