సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ‘వెబినార్’ కీలకమైన సాంకేతిక అస్త్రంగా మారింది. కరోనా కాలాన్ని సైతం అనువుగా మార్చుకునేందుకు చక్కటి వేదికగా తయారైంది. ఇది ప్రతి అంశంలోనూ లోతైన విశ్లేషణకు దోహదం చేస్తోంది. అంతర్జాల వేదికగా ఎల్లలు చెరిపేస్తూ సమగ్ర చర్చలకు ఊతమిస్తోంది. అనేక సందేహాలకు సమాధానాలు, సమస్యలకు పరిష్కారం చూపుతోంది. వివిధ రంగాల విషయ నిపుణులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు కార్పొరేట్ రంగానికి పరిమితమైన వెబినార్ వేదికను ప్రస్తుతం విద్యారంగం తమ కార్యకలాపాలకు అనువుగా మలుచుకుంది. తాజాగా ఉపాధి కల్పనపై సైతం ఈ వేదిక ద్వారా అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఏకంగా సోషల్ మీడియాలో వెబినార్ పోస్టింగ్‌లు జోరందుకున్నాయి. స్థానిక సమస్యల నుంచి అంతర్జాతీయ అంశాల వరకు వెబినార్ సదస్సులు జరుగుతున్నాయి.
మారిన పరిస్థితులు..
లాక్‌డౌన్, కరోనా వైరస్‌తో అన్ని రంగాల్లో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవంగా కరోనా పరిస్థితుల కంటే ముందు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించేవి. భౌతికంగా జరిగే సదస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లుగా హాజరై ప్రసంగించేవారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితులు మారాయి. భౌతికంగా జరిగే సదస్సులకు ఫుల్‌స్టాప్ పడింది. పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత వినియోగంలోకి వచ్చింది. ఇప్పటివరకు కార్పొరేట్ రంగానికి పరిమితమైన అంతర్జాల మీటింగ్‌లు అన్ని రంగాలకూ విస్తరించాయి. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్‌ల ఆధారంగా సదస్సులకు శ్రీకారం చుడుతున్నారు. కేవలం అంతర్జాలం సేవలుంటే చాలన్న మాదిరిగా మారింది.
నిర్వాహకులు అందరినీ సమన్వయపర్చుకుంటూ గంటల తరబడి వివిధ అంశాలపై వెబినార్ ద్వారా లోతైన చర్చలు చేపడుతున్నారు. వీడియో ఆధారిత యాప్‌ల సహాయంతో నిర్వహించే వెబినార్‌లో వందల మంది వరకు పాల్గొంటూ అభిప్రాయాలను సైతం పంచుకుంటున్నారు. సంక్లిష్ట అంశాలపై విషయ నిపుణులు పవర్ పాయింట్ టెంప్లేట్, బొమ్మలు, చిన్న వీడియోలు, పీడీఎఫ్ రూపంలో ఉండే నివేదికల ద్వారా వివరిస్తున్నారు. దీంతో వెబినార్ వేదికపై ఆసక్తి పెరుగుతోంది.
నిరుద్యోగులకు సైతం..
వెబినార్ వేదికలు నిరుద్యోగులకు వరంగా మారాయి. కరోనా కష్టం కాలంలో సైతం వివిధ రంగాల్లో ఉపాధిపై అవగాహన పెంచుకునే వెసులుబాటు కలుగుతోంది. ప్రత్యేకంగా ఉపాధి కల్పనా శాఖ వెబినార్ వేదిక ద్వారా ఉద్యోకావకాశాలపై అవగాహనకు బాటలు వేస్తోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో, మోడల్ కెరీర్ సెంటర్, ఈ– లెర్న్ ఓకే (ఇండియా) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 28న ఉచిత వెబినార్ సదస్సు నిర్వహించనుంది. నిరుద్యోగులకు గ్రాడ్యుయేట్, ఎంబీబీఎస్ పట్టభద్రులకు డిజిటల్ మార్కెటింగ్ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment