నేటి సాయంత్రం5 గంటలకు అన్నీ బంద్
తాండూరు: రెండు నెలలుగా హోరాహోరీగా సాగిన ప్రచారానికి నేడు తెరపడనుంది. మైక్‌ల గోల, డప్పు చప్పళ్లు. ఇంటింటి ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఇన్ని రోజులు కాళ్లకు బలపం కట్టుకుని పరుగులు పెట్టిన అభ్యర్థులు.. చివరి రోజు వీలైనంత మందిని కలిసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇదే క్రమంలో ఓటర్లను తమవైపు తిప్పునుకునేందుకు ప్రలోభాలకు తెర తీస్తున్నారు. తాండూరులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఆఖరి రోజు కావడంతో ఎన్నికల ప్రచారాన్ని ఉదయం నుంచే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తెలపడుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రోహిత్‌రెడ్డి చివరి రోజు తాండూరు పట్టణంతో పాటు అన్ని మండలాలను చుట్టేసేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా ఆయన తన సొంత మండలమైన బషీరాబాద్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీలైనన్ని గ్రామాల్లో ప్రచారం చేయాలని పూనుకున్నారు.
కాంగ్రెస్‌లో నూతనోత్సాహం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి చివరి రోజు ఎన్నికల ప్రచారంతో ప్రజల్లో జోష్ పెంచాలని భావిస్తున్నారు. అందుకోసం పార్టీలోని కీలక నేతలు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే తాండూరు నియోజకవర్గంలో నిర్వహించిన సభలు, సమావేశాలు విజయవంతం కావడంతో నూతనోత్సాహంతో ఆయనదూసుకుపోతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో కలియతిరగాలని నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నారు.
గ్రామాల నుంచి కదలొద్దు
అసెంబ్లీ ఎన్నికల చివరాంకంలో నాయకులు, కార్యకర్తలు గ్రామాలు, మున్సిపల్ వార్డులు విడిచి బయటకు వెళ్లొద్దని ప్రధాన పార్టీల నేతలు హుకుం జారీ చేశారు. పట్టణంలోని వార్డు, బూత్ ఇన్‌చార్జిలు, మండల నాయకులు, గ్రామ స్థాయి నాయకులంతా ఎవరి గ్రామాల్లో వారు ఉండాలని అభ్యర్థులు ఆదేశాలు జారీ చేశారు. సమయం లేదు మిత్రమా అంటూ హడావిడి చేస్తున్నారు. మరోవైపు పోలింగ్‌కు మరో 50 గంటలు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
మీ బిడ్డను గెలిపించండి
బీఆర్‌ఎస్ మహేశ్వరం అభ్యర్థి సబితారెడ్డి
మీర్‌పేట: ‘మహేశ్వరం నా ఇళ్లు’.. మీ ఇంటి ఆడబిడ్డనైన నన్ను ఆశీర్వదించి గెలిపించాలని బీఆర్‌ఎస్ అభ్యర్థి సబితారెడ్డి ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా సోమవారం మీర్‌పేట కార్పొరేషన్‌లోని జిల్లెలగూడలో దాసరి నారాయణరావునగర్, కమలానెహ్రూనగర్, మీర్‌పేట కూడలి వరకు రోడ్‌షో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్, నల్లా ద్వారా ఇంటింటికి మంచినీరు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, దళితబంధు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు గతంలో ఈ ప్రాంతంలో వరదలప్పుడు, కరోనా కష్టకాలంలో కనపడలేదన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గ, డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, కార్పొరేటర్లు అనిల్‌యాదవ్, సిద్దాల బీరప్ప, ధనలక్ష్మి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతోనే బీసీలకు న్యాయం
పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్
మంచాల: బీజేపీతోనే బీసీలకు న్యాయం చేకూరుతుందని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని లోయపల్లిలో పార్టీ అభ్యర్థి నోముల దయానంద్‌కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పనులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తామే చేసినట్లు చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment