తావు విడిస్తే.. సావొస్తది
దుద్యాల్: తావు విడిస్తే సావొచ్చే అవకాశం ఉందని ఫార్మా బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం దుద్యాల్ మండలం లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో పర్యటించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు పలువురు భూ బాధితులు గోడును వెల్లబోసుకున్నారు. ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం మా భూములను బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తండాల ఉనికే లేకుండా చేయాలని కంకణం కట్టుకుందని మండిపడ్డారు. తరతరాలుగా పొలాలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, మమ్మల్ని రోడ్డుపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ నెల 11న లగచర్లలో అధికారులు, రైతుల మధ్య చోటుచేసుకున్న ఘటన తర్వాత చాలా మంది భయంతో తండాలకు రావడం లేదన్నారు. కొంత మందిపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేసి జైలులో ఉంచారని తెలిపారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. మాకు ఎలాంటి పరిహారం వద్దని, కోటి రూపాయలు ఇచ్చినా భూముల ఇవ్వమని స్పష్టం చేశారు. ఉన్న పొలంలోనే పంటలు పండించుకొని జీవనం సాగిస్తామని తెలిపారు.
ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం
కోటి పరిహారం ఇచ్చినా భూములిచ్చేది లేదు
ఫార్మా బాధిత రైతులు
భయంతో బతుకుతున్నాం
ఎప్పుడు ఎవరొచ్చి తీసుకెళ్తారో అనే భయంతో బతుకుతున్నాం. తప్పు చేయని వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నేను పాలు పోయడానికి వెళ్తుంటే పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత వదిలిపెట్టారు. తండాలో స్వేచ్ఛగా తిరగలేక పోతున్నాం. మా భూముల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయరాదు. తండాల్లో ప్రశాంత వాతావరణం కోసం అధికారులు కృషి చేయాలి.
– రూప్ సింగ్ నాయక్, రోటిబండ తండా
మా భూములు ఇవ్వం
ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నాం. పచ్చటి పొలాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయరాదు. మా భూములను ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వం. నేను నిండు గర్భిణిని.. నా భర్తను అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. డెలివరీ సమయం.. ఎలాగైనా మా ఆయన్ను విడిచిపెట్టాలి. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం.
– జ్యోతి, పులిచెర్లకుంట తండా
Comments
Please login to add a commentAdd a comment