అవగాహనతోనే నేరాల కట్టడి
తాండూరు రూరల్: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో సైబర్, ఆర్థిక నేరాలు పెరిగాయని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం తాండూరు మండలం గౌతాపూర్ శివారులోని రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హత్యలు, హత్యాయత్నం, అత్యాచార కేసులు తగ్గినట్లు చెప్పారు. ఆర్థిక మోసాలు, లోన్ యాప్స్, ఓటీపీ, సెక్స్ టార్చర్ లాంటి కేసులు నమోదైనట్లు తెలిపారు. సైబర్ మోసగాళ్ల బారిన పడి ప్రజలు రూ.4 కోట్ల 50 లక్షల నగదు పోగొట్టుకున్నారని వివరించారు. గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం పెరగడంతో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయని తెలిపారు. వాటిని నివారించాలంటే అవగాహన ఒక్కటే మార్గమన్నారు.
తాండూరు సర్కిల్ పరిధిలో..
తాండూరు సర్కిల్ పరిధిలోని కరన్‌కోట్, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ పోలీస్‌స్టేషన్లలో గత ఏడాది కంటే ఈ సారి క్రైం రేటు పెరిగినట్లు ఎస్పీ తెలిపారు. ఈ నాలుగు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 795 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 22 గ్రేవ్ కేసులు, మూడు హత్య కేసులు, 10 రేప్ కేసులు, 3 రోడ్డు ప్రమాదాలు, 94 ఆత్మహత్య కేసులు, 53 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 56 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. అతివేగంగా వెళ్లే ఇసుక ట్రాక్టర్లకు చలాన్ వేయాలని ఆదేశించారు. నాపరాతి గనుల్లో బ్లాస్టింగ్, ఓవర్‌లోడ్‌తో వెళ్లే లారీలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల యాజమాన్యంతో మాట్లాడి సీసీ కెమరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, ఏఎస్‌ఐ పవన్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఏడాది జిల్లాలోసైబర్ క్రైం పెరిగింది
ఎస్పీ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment