ఏసీబీ నిఘా నీడలో..
● పూడూరు తహసీల్దార్ కార్యాలయం ● ప్రతి పనికీ డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ● బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి అవినీతి నీరోధక శాఖ ● సెలవులో వెళ్లిన కొంతమంది సిబ్బంది
పూడూరు: పూడూరు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. రైతుల భూములను ఇతరుల పేర్లపై మార్చి డబ్బు దండుకొంటున్నట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది చేతులు తడిపితేనే తప్ప పనులు జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రైతుల ప్రమేయం లేకుండా వారి భూములను రియల్టర్ల పేరున నమోదు చేస్తున్నారు. ఈ విషయం కలెక్టర్, ఎస్పీ దృష్టికి కూడా వెళ్లింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పూడూరు డిప్యూటీ తహసీల్దార్‌ను శుక్రవారం కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం మండలానికి చెందిన ఓ వ్యక్తి తమ కుటుంబానికి చెందిన ఆరు ఎకరాలు భూమిని విరాసత్ చేయాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయమై మహిళా ఆర్‌ఐను కలిశాడు. తరచూ కార్యాలయానికి వస్తున్నా పని కాకపోవడంతో సదరు వ్యక్తి ఆర్‌ఐని నిలదీశాడు.. డబ్బు ఇస్తేనే పని జరుగుతుందని.. తాము కూడా పైఅధికారులకు డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని.. రూ.5లక్షలు కావాలని కోరింది.. మండలంలోని మన్నేగూడకు చెందిన మరో వ్యక్తి తన తల్లి చనిపోవడంతో ఆమె పేరిట ఉన్న అసైన్డ్ భూమిని తమ పేరున మార్చాలని కోరితే రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. సదరు అధికారి డబ్బు డిమాండ్ చేస్తుండగా తీసిన వీడియోను బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగి పూడూరు తహసీల్దార్ కార్యాలయంపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కొందరు అధికారులు సెలవుల్లో వెళ్లారు. తహసీలార్ ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసి ఉండటంతో ఏసీబీ ఆధికారులు వెనుదిరిగి వెళ్లినట్లు తెలిసింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో సదరు మహిళా అధికారిని కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు. రైతు అనుమతి లేకుండా భూములు బదలాయించిన డీటీని సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment