● మహిళల మెడల్లో బంగారు గొలుసులు కాజేస్తున్న అమూల్య ● రద్దీ ప్రాంతాలు, బస్టాండ్‌లే టార్గెట్ ● పరిగి బస్టాండ్‌లో చోరీ కేసులను ఛేదించిన పోలీసులు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్
పరిగి: రద్దీ ప్రాంతాలు, బస్టాండ్‌లే టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ లేడీని పరిగి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలను పరిగి సీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సీతానగర్, భూవనగిరి పట్టణానికి చెందిన పసుపులేటి అమూల్య రద్దీ ఉండే బస్టాండ్‌లలో మహిళల మెడల్లోని బంగారు గొలుసులు దొంగలిస్తోంది. పరిగి బస్టాండ్‌లో నెల రోజుల వ్యవధిలో మూడు దొంగతనాలు జరిగాయి. దీంతో పోలీసులు నిఘా పెంచారు. చోరీలకు పాల్పడుతోంది పసుపులేటి అమూల్య అని గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్‌కు చెందిన మహ్మద్ ఇక్బాల్ హైదరాబాద్‌లో ఉంటూ జార్ఖండ్, బీహార్, ఒరిస్సా గ్యాంగ్‌ల సహకారంతో తమతో దొంగతనాలు చేయిస్తున్నట్లు ఒప్పుకుంది. దొంగతనం చేసిన మొత్తంలో సగం మహ్మద్ ఇక్బాల్‌కు ఇస్తున్నట్లు తెలిపింది. డబ్బు ఇవ్వకుంటే పోలీసులకు పట్టిస్తామని వారు బెదిరిస్తున్నారని చెప్పింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతాల్లో దొంగతనాలు చేయిస్తాడని పేర్కొంది. ప్రస్తుతం మహ్మద్ ఇక్బాల్ పరారీలో ఉన్నాడు. జిల్లాలో పసుపులేటి అమూల్య ఐదు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. వికారాబాద్ బస్టాండ్‌లో రెండు, పరిగి బస్టాండ్‌లో మూడు దొంగతనాలు చేసినట్లు వివరించారు. 11 తులాల 8 గ్రాముల బంగారు నగలు, రూ.1,60,000 నగదు చోరీ చేసినట్లు తెలిపారు. అమూల్య నుంచి 11.8 తులాల బంగారు నగలు, రూ.80 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐలు బలవంతయ్య, అన్వర్, పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్, పోలీసులు జయవర్ధన్, శివకుమార్, చెన్నయ్య, రామకృష్ణ, గోవింద్, రాఘవేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment