గాజువాక జోన్‌లో ఒకే ఒక్కడు
● నీటి సరఫరా విభాగం ఏఈలందరూ బదిలీ ● ఒకే ఏఈకి 20 వార్డుల బాధ్యతలు
గాజువాక: జీవీఎంసీ గాజువాక జోన్ నీటి సరఫరా విభాగంలో సహాయ ఇంజనీర్ల బదిలీలో వింత చోటుచేసుకుంది. 20 వార్డులు, 5 లక్షల మంది జనాభా, 60వేల నీటి కుళాయి కనెక్షన్లు ఉన్న గాజువాక జోన్‌లో ఆ విభాగం మొత్తానికి ఒకే ఒక ఏఈని ఉంచి మిగిలినవారిని బదిలీ చేసేశారు. ఇది ఆ విభాగంలో సిబ్బందిని సైతం విస్మయానికి గురి చేసింది. దీని వెనుక భారీ పైరవీలు, కూటమికి చెందిన ఇద్దరు కార్పొరేటర్ల ఒత్తిడి ఉన్నట్టు సమాచారం. గాజువాకలో మొత్తం నాలుగు నీటి సరఫరా ప్రాజెక్టులున్నాయి. 10 ఎంజీడీ, 2 ఎంజీడీ వాటర్ ప్రాజెక్టులు సుందరయ్య కాలనీ వద్ద, 85 ఎంఎల్‌డీ వాటర్ ప్రాజెక్టు అగనంపూడిలోను, 2.65 ఎంజీడీ వాటర్ ప్రాజెక్టు సిద్ధార్థనగర్‌లోను, 1 ఎంజీడీ వాటర్ ప్రాజెక్టు షీలానగర్‌లోను ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 60 వేల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి గతంలో నలుగురు సహాయ ఇంజనీర్లు పనిచేయగా కొన్నిరోజుల క్రితం ముగ్గురు సహాయ ఇంజనీర్లు పనిచేశారు. తాజాగా వారిలో ఇద్దరు సహాయ ఇంజనీర్లను బదిలీ చేశారు. ప్రస్తుతం జోన్ మొత్తానికి ఒకే ఒక ఏఈని ఉంచారు. దీనిపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు ఏఈలు ఉన్నప్పుడే ప్రతి రోజు సమస్యలు చోటు చేసుకున్న పరిస్థితులున్న నేపథ్యంలో ఒకే ఒక్క ఏఈతో సేవలు ఎలా అందుతాయన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మిగతా జోన్లలో ఇలా..
జీవీఎంసీ పరిధిలోని జోన్–2లో ముగ్గురు ఏఈలు, జోన్–3లో ముగ్గురు, జోన్–4లో ఇద్దరు, జోన్–5లో ముగ్గురు, జోన్–7లో ఇద్దరు ఏఈలు ఉన్నారు. ఒక్క గాజువాక జోన్‌లోనే ఈ విధంగా బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంత పెద్ద జోన్‌కు ఒక్క ఏఈ ఉండటం ఏమిటా అని నీటి సరఫరా సిబ్బంది సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నిర్ణయం వెనుక టీడీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. అయితే నీటి సరఫరాలో ఉన్నతాధికారులు మాత్రం దీనికి రకరకాల కారణాలు పేర్కొంటున్నారు.
అస్తవ్యస్తంగా నీటి సరఫరా వ్యవస్థ
ప్రస్తుతం గాజువాక జోన్‌లో నీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న విషయం తెలిసిందే. కొన్ని వార్డుల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా సాగుతోంది. మరికొన్ని వార్డుల్లో నీరు ఏ సమయానికి ఇస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. నిత్యం ఎక్కడోచోట లీకులు ఏర్పడి జనం అవస్థలు పడుతూనే ఉన్నారు. అందువల్ల ప్రతి ప్రాజెక్టుకు ఒక ఏఈ ఉండాల్సిన అవసరం ఉందని జోనల్ అధికారులు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు గాజువాక జోన్‌కు ఒకే ఒక్క ఏఈని ఉంచడం పట్ల విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.
కొత్త ఏఈలను నియమిస్తాం
గాజువాక జోన్‌కు ఒక్క ఏఈ సరిపోరు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో ఇద్దరు ఏఈలను బదిలీ చేశారు. జీవీఎంసీకి తక్కువ మంది ఏఈలు వచ్చారు. అందువల్లే గాజువాకకు జోన్‌లో ప్రస్తుతం ఒక్క ఏఈని ఉంచాం. త్వరలోనే కొత్త ఏఈల నియామకం జరుగుతుంది.
–పి.కనకారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వాటర్ సప్లయ్
Comments
Please login to add a commentAdd a comment