గంటా కొడుకా.. మజాకా!
● కొడుకు, మనవడికీ ప్రొటోకాల్ మర్యాదలు ● గంటా కుటుంబ సేవలో తరిస్తున్న అధికారులు
తగరపువలస: భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావుకు కల్పించే ప్రొటోకాల్ ఇప్పుడు ఆయన కుమారుడు రవితేజ, మనవడికీ కూడా కల్పించి, తమ స్వామి భక్తిని చాటుకున్నారు ఇక్కడి అధికారులు. బుధవారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా భీమిలి జెడ్సీ పి.ప్రేమప్రసన్నవాణి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ తిరుపతిరావు, మెప్మా సిబ్బంది తదితరులు గంటా క్యాంప్ కార్యాలయానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందించి మరీ.. అభినందించిన సంగతి తెలిసిందే. దీనిపై జోనల్ అధికారులు భీమిలి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అసలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావా? లేక ఆయన కొడుకు రవితేజా? అంటూ ఆక్షేపించారు. శుక్రవారం అసోసియేషన్ ఆఫ్ భీమిలి క్రికెటర్స్ ఆధ్వర్యంలో ఫ్రీడం క్రికెట్ కప్‌ను గంటా రవితేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా రవితేజ, ఆయన కుమారుడు పాల్గొన్నారు. వీరికి రాజకీయ నాయకులతో పాటు జెడ్సీ ప్రేమప్రసన్నవాణి ఎదురెళ్లి మరీ ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే కుమారుడు, మనవడి వెంట ప్రొటోకాల్ అధికారులు పాల్గొనడంతో స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. గతంలో భీమి లి, పెదగంట్యాడ మండలాల జెడ్పీ హైస్కూళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఆ తర్వాత అమరావతి ఎస్‌సీఈఆర్టీలో విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ప్రస్తుతం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు పీఏగా ఉన్నారు. ఎమ్మెల్యే లేకుండానే ఆయన కుమారుడు, మనవడి కార్యక్రమాలతో పాటు రెండు రోజుల క్రితం జరిగిన రవితేజ పుట్టినరోజు వేడుకలను ఈయనే అంతా తానై నడిపించారు. ఈ తీరును కూటమి నాయకులు సహించలేకపోతున్నారు. వీరి పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యే గంటాకే కాకుండా ఆయన కుటుంబం మొత్తానికి సేవ చేసుకోవాలా.. అంటూ గొణుక్కుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment