● ఆక్సిజన్ టవర్స్ చోరీ కేసులో మహిళపై విచక్షణారహిత దాడి ● ఘనటపై సీపీ సీరియస్.. ఉన్నతాధికారులతో విచారణ ● తాజాగా క్రైమ్ ఎస్‌ఐ ఎన్.జగదీష్‌పై సస్పెన్షన్ వేటు ● ద్వారకా క్రైమ్ సీఐ బంగారుపాపపై శాఖాపరమైన చర్యలు
సీతమ్మధార: ఓ ఫిర్యాదుపై అనుమానితురాలి పేరిట మహిళ కాలు ఫ్రాక్చర్ అయ్యేలా విచక్షణారహితంగా కొట్టిన ఎంవీపీ క్రైమ్ ఎస్‌ఐ ఎన్.జగదీష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. శాఖాపరమైన చర్యలకు సైతం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు ఈ ఘటనలో ద్వారకా క్రైమ్ సీఐ బంగారుపాపపై కూడా శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. వివరాలు. ఆక్సిజన్ టవర్స్‌లోని ఓ ఇంట్లో గంగ అనే మహిళ పనిచేసేది. ఆమె పని మానేస్తానని చెప్పి, వెళ్లిపోయింది. అయితే ఇంటి యజమానులు తమ నక్లెస్‌ను చోరీ చేసిందంటూ గంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంవీపీ క్రైమ్ ఎస్‌ఐ జగదీష్ ఆమెను స్టేషన్‌ను తీసుకువెళ్లి విచక్షణ మరిచి దారుణంగా కొట్టారు. దీంతో ఆమె కాలు విరిగిపోయింది. ఆస్పత్రిలో చేర్పించడంతో గంగ బంధువులు ఆక్సిజన్ టవర్స్ వద్ద మూడు రోజుల క్రితం ఆందోళనకు దిగారు. తప్పుడు కేసు పెట్టిన ఇంటి యజమానులపైనే కాకుండా, విచక్షణారహితంగా కాలు విరగ్గొట్టిన క్రైమ్ ఎస్‌ఐ జగదీష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మహిళా సంఘాలు కూడా ఆమెకు మద్దతుగా నిలిచాయి. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారుల విచారణలో వాస్తవాలు నిర్ధారణ కావడంతో ఎంవీపీ క్రైమ్ ఎస్‌ఐను సస్పెండ్ చేస్తూ శుక్రవారం సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు ద్వారకా క్రైమ్ సీఐ డి.బంగారుపాపపై కూడా శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. నగర ప్రజలు ఎటువంటి ఫిర్యాదులైనా 7995095799 నెంబర్‌కు తెలియజేయాలని సీపీ సూచించారు. సమాచారం, ఫిర్యాదులు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment