అవ్వా,తాతలకు చుక్కలు
● సర్వర్ సమస్యతో పింఛన్ల పంపిణీ ఆలస్యం ● సచివాలయాల వద్ద క్యూ ● ఎండలో ఇబ్బంది పడ్డ వృద్ధులు, వితంతువులు
మహారాణిపేట: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీ వచ్చిందంటే అవ్వాతాతల మోముల్లో ఆనందం వెల్లివిరిసేది. ఇంటింటికీ వెళ్లి తలుపుతట్టి పింఛన్లు అందజేసేవారు. కూటమి ప్రభుత్వ వచ్చాక..ఆ చిరునవ్వులు బోసిపోయాయి. వృద్ధులు, వితంతువులు పెన్షన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. తాజాగా శుక్రవారం పంపిణీ చేసిన పింఛన్ల ప్రక్రియలో అవ్వాతాతలకు చుక్కలు కనిపించాయి. ఇంటికే వచ్చి పింఛన్లు అందజేస్తామని ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. అందరూ సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. ఉదయం 9 గంటలైనా కొన్ని ప్రాంతాల్లో పింఛను సొమ్ము చేతికి అందలేదు. సర్వర్ పనిచేయడం లేదని గంటల తరబడి క్యూలో నిల్చోబెట్టారు. దీంతో వృద్ధులు ఆపసోపాలు పడ్డారు. జిల్లాలో మొత్తం 1,61,969 పింఛన్లు ఉండగా, వీరి కోసం రూ.69,59,56,000 ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయానికి 93.98 శాతం మందికి పింఛను పంపిణీ పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ విభాగం, నగర పరిధిలో జీవీఎంసీ పింఛన్లు పంపిణీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment