అర్జీలు పునరావృతం కాకూడదు
● వినతులకు తక్షణ పరిష్కారం చూపాలి ● కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా నలుమూలలనుంచి వచ్చిన ప్రజలనుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలన్నారు. సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో 328 వినతులు అందగా..రెవెన్యూ శాఖకు 149 ఉండగా, పోలీసు శాఖకు 19, జీవీఎంసీకి 53 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 107 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment