పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం
పరవాడ: సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాల పట్ల సదస్సులు నిర్వహించి.. ప్రజలకు అవగాహన కల్పించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పరవాడ సబ్ డివిజన్ కార్యాలయం, పరవాడ పోలీస్ స్టేషన్లను అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. ముందుగా పోలీసులు డీఐజీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ పోక్సో కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. సబ్ డివిజన్ పరిధిలో రోడ్డు భద్రతపై సదస్సులు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి రవాణా జరిగే మార్గాల్లో నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని కేసుల తాజా పరిస్థితిని సమీక్షించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, వాటిని త్వరితగతిన కోర్టుకు నివేదించాలని డీఎస్పీ కె.వి.సత్యనారాయణను ఆదేశించారు.
ముగిసిన పోలీస్ శిక్షణ : పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల పట్ల పోలీసు యంత్రాంగం తక్షణం స్పందించాలని డీఐజీ ఆదేశించారు. ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు తమను తాము రక్షించుకునేందుకు పోలీసులు సమయస్ఫూర్తితో మెలగాలన్నారు. ఫార్మాసిటీలో ఎంఏఎస్‌ఆర్‌ఎం ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోలీసు శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. ఈ శిబిరాన్ని డీఐజీ సందర్శించి మాట్లాడారు. సీఐ ఆర్.మల్లికార్జునరావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి.వి.వి.ఎస్.నారాయణ, జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె.వీరభద్రరావు, ఎంఏఎస్‌ఆర్‌ఎం సంస్ద కార్యదర్శి జెట్టి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, సభ్యుడు ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment