మంటలు
గ్యాస్ సిలిండర్లు లీకై
ఏడుగురికి గాయాలు
● తీవ్రగాయాలైన ముగ్గురిని మెడికవర్ ఆస్పత్రికి తరలింపు ● ఓల్డ్ డెయిరీఫారం ఇందిరానగర్‌లో ఘటన
గాయాలపాలైన పి.వెంకటరావు
ఆరిలోవ : ఇంట్లోని రెండు గ్యాస్ సిలిండర్లు లీకై మంటలు వ్యాపించి ఏడుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జీవీఎంసీ పదో వార్డు పరిధి ఓల్డ్ డెయిరీఫారం ఇందిరానగర్‌లో బుధవారం రాత్రి 9.30 గంటలకు చోటుచేసుకుంది. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐలు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను విమ్స్‌కు తరలించారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. టి.సత్యవతి అనే మహిళ ఓల్డ్ డెయిరీఫారం వద్ద ఫ్యాన్సీ షాప్ నిర్వహిస్తుంది. రాత్రి 9.30 గంటల సమయంలో ఇందిరానగర్‌లో గల ఇంటికి వెళ్లి వంట చేయడానికి గ్యాస్ స్టవ్ వెలిగించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చేలరేగి ఇల్లంతా వ్యాపించాయి. టి.సత్యవతి(28)కి, ఆమె కుమారులు రాజశేఖర్(11), చంద్రశేఖర్‌కు(13), ఆమె అన్నయ్య పి.వెంకటరావు(30)కు తీవ్ర గాయాలు కాగా వారి పక్కంటిలో ఉంటున్న జి.నందిని(22)కి కాళ్లు, చేతులు, వీపు భాగాల్లో గాయాలయ్యాయి. సంవత్సరం వయసు గల నందిని కుమార్తె జి.జస్మితకు, ఆమె మరిది జి.వెంకటేష్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను విమ్స్‌కు తరలించారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు పర్యవేక్షణలో సిబ్బంది వైద్య సేవలు అందించారు. సత్యవతి (70 శాతం గాయాలు), రాజశేఖర్ (70 శాతం గాయాలు), చంద్రశేఖర్(60 శాతం గాయాలు)ని మెరుగైన వైద్యం కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పరామర్శించారు.
ఉదయమే మార్చిన సిలిండర్
బుధవారం ఉదయమే కొత్త గ్యాస్ సిలిండర్ స్టవ్‌కు అమర్చారు. అదిసరిగా లేకపోవడంతో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై రాత్రి వంట చేయడానికి స్టవ్ వెలిగించిన వెంటనే మంటలు వ్యాపించి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.
ప్రమాదానికి గురైన ఇల్లు
Comments
Please login to add a commentAdd a comment