స్పెషల్ ఫోకస్
● స్పెషల్ బ్రాంచ్ ప్రక్షాళనకు పోలీస్ కమిషనర్ చర్యలు ● త్వరలో కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు బదిలీలు? ● ఇకపై మూడు రోజుల్లో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ● ఏడు రోజుల్లో ఉద్యోగ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు జారీ
విశాఖ సిటీ : పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌పై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రత్యేక దృష్టి సారించారు. దీర్ఘకాలంగా తిష్టవేసిన వారిపై బదిలీ వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా కొంత మంది సిబ్బందిపై ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తడంతో స్పెషల్ బ్రాంచ్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కొంత మందికి స్థానచలనం కలిగించారు. త్వరలోనే అందరిపై బదిలీ వేటు వేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
అనేక ఆరోపణలు
స్పెషల్ బ్రాంచ్‌లో కొంత మంది అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై సీపీ ఇప్పటికే కొంత మందిపై రహస్యంగా విచారణ చేయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఆరోపణలు రుజువైతే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ విషయంలో సిబ్బందిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్న వారి వెరిఫికేషన్‌కు వచ్చే సిబ్బంది రూ.2 వేలకు పైగా వసూలు చేస్తుండడం బహిరంగ రహస్యమే. అయినప్పటికీ రోజుల తరబడి వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగ వెరిఫికేషన్ సర్టిఫికెట్‌కు కూడా 30 నుంచి 50 రోజులు కమిషనరేట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయాలపై దృష్టి పెట్టిన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఇప్పటికే సిబ్బందిపై సీరియస్ అయినట్లు తెలిసింది.
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వేగవంతం
రోజులు, నెలలు పట్టే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ఇకపై కేవలం మూడు రోజుల్లోనే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయనున్నారు. తద్వారా పాస్ట్‌పోర్ట్ కూడా త్వరగానే మంజూరయ్యే అవకాశముంది. అలాగే వివిధ కంపెనీలు, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం అవసరమయ్యే వెరిఫికేషన్ సర్టిఫికెట్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై న వారి జాబ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్‌ను కేవలం వారం రోజుల్లో అందించనున్నారు. నిర్దేశిత కాల వ్యవధిలో ఈ సేవలు అందకుంటే 7995095799 నెంబర్‌కు సమాచారం అందించాలని సీపీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment