సందడే లేదయ్యా..
సాక్షి, విశాఖపట్నం: ప్రతి ఇంటికీ కాంతులు తీసుకొచ్చే సంక్రాంతి పండగలో క్రాంతి కనుమరుగైంది. నేడు గడిచి రేపు పొద్దు పొడిచినట్టు... ఆటపాటలతో, ఆప్యాయత మాటలతో అందరూ ఒకచోట చేరి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి కళ తప్పింది. పల్లె వాకిట ఆనందాన్ని నింపే పర్వదినాన్ని.. సంప్రదాయాన్ని విడిచిపెట్టలేక.. ఏదో కానిచ్చేద్దాం అనేటట్లుగా.. చేసుకునే కుటుంబాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భీమిలి నియోజకవర్గం టి.నగరపాలెం పంచాయతీని పరిశీలిస్తే.. సంక్రాంతి సంబరాలు అటుంచితే.. ఏ గడప తట్టినా.. మౌనమే పండగ చేసుకుంటోంది. ఏ వీధికి వెళ్లినా ఆవేదనే ఆశల పతంగులు ఎగరేసుకుంటోంది.
ఏముందని పండగ చేసుకోవాలి?
ఒకప్పుడు ఏ ఊరికి ఆ ఊరే స్వయంపోషకం. ఊరందరి అవసరాలను ఊరే తీర్చేది. రైతులు పంట చేతికొచ్చి.. దాని ద్వారా వచ్చిన ఆదాయంతో పండగ చేసుకునేవాళ్లు. నేతన్న ఇంట తీరిక లేకుండా మగ్గం నడిచేది. పండక్కి ఊర్లో సింగారించుకునే ప్రతి కోకా.. ఆ ఊరే నేసేది. ప్రతి పంచే అక్కడే హుందాగా తయారయ్యేది. కులవృత్తులకు కూడు పెట్టేది. పండక్కి ఊరి సాంస్కృతిక సందడిని ఊరే సమకూర్చుకునేది. కొనుగోళ్లు, అమ్మకాలతో.. ప్రతి ఇంట్లో పండగ జరిగేది. కానీ.. కాలం మారింది. క్రమంగా పంటల దిగుబడి తగ్గిపోయింది. పెట్టుబడి పెరిగిపోయింది. కులవృత్తులు కనుమరుగైపోయాయి. రెడీమేడ్ రాజ్యమేలుతుంటే నేతన్న నీరసించిపోయాడు. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వాలు ఆదుకునేవి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతన్నకు ‘భరోసా’ కల్పించి.. పెట్టుబడి సాయమందించింది. కులవృత్తులకు ‘ఆసరా’ ఇచ్చింది. మహిళలకు ఆర్థిక ‘చేయూత’ నందించింది. అందుకే.. ఊరందరి అవసరాల్ని ఊరు తీర్చకపోయినా.. సర్కారు సాయంతో సరదాగా గడిపేవారు. పండగకూ ప్రతి ఇల్లూ కళకళలాడేది. ఇప్పుడు ఎవర్ని అడిగినా ఏముందని పండగ చేసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతు సంతోషంగా లేడు. పనులు సరిగా జరగక చేతికి చిల్లిగవ్వ దొరక్క కూలీ కూడా కూలబడిపోయాడు. వ్యాపారాలు లేకపోవడంతో వ్యాపారులు కునారిల్లిపోయారు. మహిళలల్లోనూ ఆనందం కనిపించడం లేదు. అన్ని రంగాల ప్రజలూ అస్తవ్యస్త జీవనంలోకి నెట్టేసినట్లుగా మారిపోయారు. ఫలితంగా అసలైన సంక్రాంతి పండగ టి.నగరపాలెంలో ఎక్కడా కనిపించడం లేదు.
మనీ రొటేషన్ జరగడం లేదు
గతేడాది వరకూ మా ఊరిలో సంక్రాంతి అంటే హడావుడి ఉండేది. ధనుర్మాసంలో భజనలు చేసేవాళ్లం. ఆర్థికంగా లేని వారు కూడా హాయిగా ఉండేవారు. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో ఆర్థికంగా చేయూత అందేది. ఏదో ఒక పథకం రూపంలో ప్రజలకు డబ్బులు వచ్చేవి. వారి జీవనం సాఫీగా సాగేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం అందలేదు. మనీ రొటేషన్ జరగడం లేదు. అందుకే.. అన్ని రకాల వ్యాపారాలు డల్ అయిపోయాయి. ఫ్రీ ఇసుక అనే ఒక్క దానితో నిర్మాణ రంగం అస్తవ్యస్తంగా మారిపోయింది. దీనికి అనుబంధంగా ఉండే మా మార్బుల్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. నిర్మాణాలు జరిగితే కదా.. మాకు వ్యాపారాలు జరిగేవి. అందుకే సంక్రాంతి ఏదో అలా గడిచిపోతోంది.
–తమ్మిన నరేంద్ర, మార్బుల్ వ్యాపారి
పథకాలతోనే పండగ చేసుకోనేవాళ్లం
ఒకప్పుడు కూలి పనులకు వెళ్లేదాన్ని. నాకు ఏడేళ్ల క్రితం కాలికి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఇంటి భారమంతా మా ఆయన కూలి డబ్బులు మీదే నడిచేది. గత ఐదేళ్లలో మాకు అమ్మ ఒడి వచ్చింది. డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ డబ్బులు కూడా వచ్చాయి. వీటితోనే ఇల్లు గడిచిపోయేది. పండగలు జరిగేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. చేతిలో డబ్బులు లేవు. ఏం చేయాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు. – లక్ష్మి సోమి, ఎస్‌సీ కాలనీ
సంక్రాంతి పండగంటే మా ఊళ్లో హడావుడి ఉండేది. పిల్లలు, చుట్టాలు భోగి పండగకు రెండు రోజుల ముందే వచ్చేసేవాళ్లు. ఈ పాటికి మా ఇంట్లో మా తాహతు కొద్దీ పిండి వంటలు చేసుకునేవాళ్లం. ఇప్పుడు సందడే లేదయ్యా. చూశారు కదా.. ఊరంతా బోసిపోయినట్లు ఉంది. ఏదైనా కొందామంటే.. ధరలు ఆకాశాన్ని తాకాయి. ఎవరి దగ్గరా డబ్బులు లేవు. ఇంక పండగలేం చేసుకుంటాం.
–కశింకోట సింహాచలం, వృద్ధురాలు
Comments
Please login to add a commentAdd a comment