భక్తిశ్రద్ధలతో నృసింహ దీక్షల విరమణ
సింహాచలం: సింహగిరిపై మాలధారులు శ్రీ నృసింహ దీక్షలు ఆదివారం విరమించారు. 41 రోజుల మండల దీక్ష, 32 రోజుల దీక్ష ధారులంతా శిరస్సుపై తిరుముడులను పెట్టుకొని సింహగిరికి తరలివచ్చారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి వాటిని సమర్పించి దీక్ష విరమించారు. వారికి ఉచితంగా అంతరాలయ దర్శనాన్ని దేవస్థానం కల్పించింది. అనంతరం శ్రీగోకులంకి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద వైదికులు దీక్ష ధారులందరిచేత శాస్త్రోక్తంగా దీక్ష విరమింపజేశారు. సింహాచలానికి చెందిన చందన పెరుమాళ్ పీఠం గురుస్వామి సానబోయిన రాజు, సింహాద్రి మఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్ర, శ్రీనృసింహ పెరుమాళ్ పీఠం గురుస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీక్షధారులు హరినామస్మరణలు చేసుకుంటూ తిరుముడిలతో సింహగిరికి తరలివెళ్లారు.
శ్రీనృసింహ హోమం, శాంతి కల్యాణం
శ్రీనృసింహ దీక్షల విరమణను పురస్కరించుకుని ఆలయ కల్యాణమండపంలో శ్రీనృసింహ హోమాన్ని నిర్వహించారు. మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ జరిపారు. స్వామివారి శాంతి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుముడులతో సుభదా కాంప్లెక్స్‌లో నుంచి అంతరాలయంలోకి వెళ్లే దీక్షధారులందరినీ కల్యాణమండపం మీదుగా పంపించి శ్రీనృసింహ హోమం, శాంతి కల్యాణం తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment