లారీ ఢీకొని మహిళ దుర్మరణం
మధురవాడ: సంక్రాంతి పండగ కోసం పద్మనాభం మండలం పాండ్రంగికి వెళ్తున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఇంటి ఇల్లాలిని మృత్యువు రూపంలో వచ్చిన గూడ్స్ లారీ పొట్టనపెట్టుకుంది. ఈ ఘటనలో వెంకోజీపాలెంలోని పెటల్‌షెడ్‌కి చెందిన మైలపల్లి చందు(28) మృతి చెందింది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాలు. పద్మనాభం మండలం పాండ్రంగికి చెందిన మైలపల్లి శ్రీను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బతుకు తెరువు నిమిత్తం విశాఖకు వచ్చి వెంకోజీపాలెంలో నివాసం ఉంటున్నాడు. మొదటి భార్య కనకమహాలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో చందును రెండో వివాహం చేసుకున్నాడు. సంక్రాంతి పండగ కోసం చిన్న కుమారుడు తేజ(11)తో మంగళవారం సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై పాండ్రంగి బయలు దేరాడు. కార్‌షెడ్ వద్ద బస్టాప్‌కు వెళ్లే సమయంలో గూడ్స్ లారీ అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో చందు రోడ్డుపై పడిపోయింది. ఆమె పైనుంచి లారీ దూసుకెళ్లడంతో, కాళ్లు నలిగిపోయి, తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన గూడ్స్ లారీ డ్రైవర్ అమలాపురంలోని సీతాపతిరావుపేటకు చెందిన డి.రామకృష్ణగా గుర్తించారు. మృతురాలి భర్త శ్రీను ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment