మర్రిపాలెం: అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి మృతిచెందిన ఘటన కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. 47వ వార్డు మధుసూదన్‌నగర్‌లో ఉంటున్న ప్రసన్నలక్ష్మి(26) భరద్వాజ్‌ని 2021లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది నుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. మృతురాలు నగరంలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా శివాజీపాలెంలో ఉంటున్న ఆమె తల్లిదండ్రుల దగ్గరకు కుమారుడితో కలిసి వెళ్లింది. ముభావంగా ఉంటూ ఎవరితోనూ మాట్లాడకపోవడాన్ని తల్లిదండ్రులు గమనించారు. మంగళవారం తన కుమారుడిని ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలి ఆమె మాత్రమే మధుసూదన్‌నగర్‌లోని నివాసానికి వెళ్లింది. ఇంటికి వచ్చి దీపాలు వెలిగించి, పూజ చేసుకుంది. కొంతసేపటికి పూజగది నుంచి పొగ రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలిని పరిశీలించారు. దీపాలు వెలిగించిన చోటే ఆమె కాలిపోయి, విగతజీవిగా పడిఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment