ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
అల్లిపురం: విధుల్లో అవినీతికి పాల్పడిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘సాక్షి’దినపత్రికలో ఈ నెల 11న ‘క్రికెట్ బుకీలకు కూటమి అండ’పేరుతో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ వ్యవహారంపై కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన సీపీ, కానిస్టేబుల్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్ పి.గంగరాజుకు క్రికెట్ బుకీలతో సంబంధాలు ఉన్నట్లు కమిషనర్ గుర్తించారు. అతని ఫోన్ కాల్ డేటాలోని నంబర్ల ద్వారా గత రెండేళ్లుగా ఒక కేసులో నిందితులుగా ఉన్న క్రికెట్ బుకీలతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో కొందరు కూటమి ఎమ్మెల్యేల అండ కూడా ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగర పోలీస్ శాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది పూర్తి పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగర పోలీస్ శాఖలో ఎవరైనా లంచం అడిగినా, తీసుకున్నా వెంటనే తన ఫోన్ నంబర్ 79950 95799కు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
‘క్రికెట్ బుకీలకు కూటమి అండ’
కథనానికి స్పందించిన సీపీ
Comments
Please login to add a commentAdd a comment