చెరువులో పడి వ్యక్తి మృతి
రేగిడి: మండలంలోని గుళ్లపాడు గ్రామ సమీపంలో గల వీరసాగరం చెరువులో పడి ఓ యువకుడు సోమవారం మృతిచెందినట్లు ఎస్సై పి.నీలావతి తెలిపారు. మృతుడిని బీహర్ రాష్ట్రంలోని శౌర్య గ్రామానికి చెందిన కమలేష్ సింగ్(27) గా గుర్తించామని పేర్కొన్నారు. కమలేష్ సింగ్ మండలంలోని ఓ కర్మాగారంలో కలాసీగా పనిచేస్తూ..నిత్యం మద్యం తాగుతూ ఉంటాడని, చెరువుగట్టుపై నడుస్తూ వెళ్తుండగా, అదుపుతప్పి పడిపోయినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. స్థానికులు గమనించి చెరువులోనుంచి బయటకు తీసే సమయానికే మృతిచెందినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తుచేస్తున్నామని, పోస్ట్‌మార్టం నిమిత్తం రాజాం ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించామని వెల్లడించారు
స్కూల్ గేమ్స్ జట్ల ఎంపిక రేపు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–19 స్కూల్‌గేమ్స్‌లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు ఈనెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు అండర్–19 స్కూల్ గేమ్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పీవీఎల్‌ఎన్ కృష్ణ సోమవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు బాడంగి మండలకేంద్రంలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో బాల,బాలికలకు టెన్నికాయిట్ క్రీడాంశంలోను, అలాగే అదే మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బేస్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు. అదేరోజున ఎస్.కోట మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా జట్ల ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న ఆయా పోటీల్లో విజయనగరం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని స్పష్టం చేశారు. ఎంపిక పోటీల్లో 19 సంవత్సరాలలోపు వయస్సు గల విద్యార్థులు పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు ఫోన్ 9885111375 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
అంతర్ వర్సిటీల పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ విద్యార్థులు అంతర్ విశ్వవిద్యాలయాల తైక్వాండో పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 6 నుంచి 9 వరకు అమృత్‌సర్‌లోని గురునానక్‌దేవ్ యూనివర్సిటీలో జరగనున్నాయన్నారు. జేఎన్‌టీయూజీవీ తరఫున తమ కళాశాలకు చెందిన పి.మణికంఠ (63 కేజీల విభాగం), పి.లక్ష్మీపతిరాజు (65 కేజీల విభాగం)లు ఎంపికయ్యారని చెప్పారు. ఆ విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, పీడీ బీహెచ్ అరుణ్‌కుమార్, ఇతర విద్యార్థులు అభినందించారు.
జాతీయ క్రీడల్లో పతకాలు సాధించాలి
● ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ
పార్వతీపురంటౌన్: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని క్రీడాకారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అసుతోశ్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయస్థాయి క్రీడలకు ఎంపికై న గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను సోమవారం ఆయన తన చాంబర్‌లో అభినందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థి అరిక అభిచందు జమ్ముకశ్మీర్‌లో జరిగే ఫెన్సింగ్ పోటీలకు, అదే పాఠశాలలో చదువుతున్న అరిక చరణ్ ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల ఈ సందర్భంగా పీఓ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని, ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. జాతీయస్థాయికి వెళ్లే ఈ క్రీడాకారులకు అవసరమైన సామగ్రిని ఐటీడీఏ నుంచి సమకూరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీడీలు నిమ్మల మాధవరావు, భోగేష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment