కదంతొక్కిన విద్యార్థులు
విజయనగరం అర్బన్:
విద్యారంగ సమస్యల పరిష్కారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అలక్ష్యంపై విద్యార్థిలోకం కదంతొక్కింది. కలెక్టరేట్ సాక్షిగా బుధవారం నిరసన గళం వినిపించింది. తక్షణమే విద్యాదీవెన, వసతి దీవెన, తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు పోరుబాట సాగించారు. విద్యారంగం సమస్యలు పరిష్కరించాలంటూ విజయనగరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలలుగా విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి తనయుడే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా విద్యారంగ సమస్యలు పరిష్కారంపై పట్టించుకోవడంలేదని విమర్శించారు. జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని, మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పునఃప్రారంభించాలని, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న రూ.3,480 కోట్ల ఉపకారవేతన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్స్‌లో మెస్ చార్జీలు పెంచాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, తరచూ మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. అనంతరం డీఆర్వో శ్రీనివాసమూర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శులు కె.జగదీష్, ఆర్.శిరీష, రమేష్ జిల్లా కమిటీ సభ్యులు రాజు, రమణ, భారతి, సోమేష్, నాయకులు రాహుల్, వెంకీ, వాసు, శిరీష, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయండి
విజయనగరం జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో ఇటీవల మృతిచెందిన విద్యార్థి శ్యామలరావు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. మరణించి రెండురోజులు గడుస్తున్నా శవపరీక్ష నివేదికను బహిర్గతం చేయకపోవడంపై నిరసన తెలిపారు. విద్యార్థి మృతికి కారుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి మద్దతుగా ఎస్‌ఎప్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థి కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి డీఆర్వో శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు. దీనిపై డీఆర్వో స్పందిస్తూ విద్యార్థుల స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని, విద్యార్థిమృతిపై విచారణను వేగవంతం చేయాలని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పెంటోజీరావును ఆదేశించారు.
విద్యార్థుల సమస్యలుపరిష్కరించాలంటూ
కలెక్టరేట్ వద్ద ధర్నా
తక్షణమే విద్యా, వసతి దీవెన, తల్లికి
వందనం నిధులు విడుదల చేయాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment