గోస్తనీ ఘోష..!
నుయ్యిలా తవ్వేద్దాం..
చిత్రాల్లో కనిపిస్తున్నది ఎస్.కోట మండలంలోని కొట్టాం, వేములాపల్లి, వినాయకపల్లి, గోపాలపల్లి, చామలాపల్లి గ్రామ సమీపంలో గోస్తనీ నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు. నదీ గర్భంలో ఎక్కడికక్కడే పెద్దపెద్ద గుంతలు పెట్టి ఇసుకను తవ్వేస్తున్నారు. రాత్రీపగలు తేడాలేకుండా ట్రాక్టర్లపై తరలించేస్తున్నారు. నదిపై ఉన్న వంతెనకు ఇబ్బంది లేకుండా 200 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉన్నా వ్యాపారులు మాత్రం ఇక్కడ, అక్కడ అన్న తేడా లేకుండా ఊటబావుల, వంతెన స్తంభాల సమీపంలోని ఇసుకను సైతం తోడేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇసుకను ఎస్.కోటతో పాటు జామి, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, గంట్యాడ, విశాఖ జిల్లాలోని పెందుర్తి, పద్మనాభం మండలాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇసుక తవ్వకాలతో నదీ గర్భంలోని గోతులను చూసి స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. వర్షాకాలంలో పొరపాటున నదిలో దిగితే ప్రమాదాలు తప్పవంటూ భయాందోళన చెందుతున్నారు. ఇసుక తవ్వకాల వ్యవహారం అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగుతుండడంతో నదీతీర గ్రామాల ప్రజలు అడ్డుచెప్పలేకపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. గ్రామస్థాయి అధికారుల వద్ద ఈ వ్యవహారం గురించి ప్రస్తావిస్తే.. తమవి తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలని, టార్గెట్ చేస్తారంటూ పేర్కొంటున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి గోస్తనీ నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేసి, నదీ గర్భాన్ని సంరక్షించాలని
తీర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – ఎస్.కోట
Comments
Please login to add a commentAdd a comment