మొక్కుబడిగా ‘పొలం పిలుస్తోంది’..!
రామభద్రపురం:
జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మొక్కుబడి తంతుగా సాగుతోంది. రైతులకు అధిక ప్రయోజనం కల్పించే కార్యక్రమానికి కొన్నిచోట్ల వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు డుమ్మాకొడుతున్నారు. ఏఓల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు సేవా కేంద్రాల(ఆర్‌బీకేలు)లో నామమాత్రంగా అవగాహన సదస్సులు నిర్వహించి మమ అనిపిస్తుండడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. పంటల సాగులో రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడం, మార్కెట్‌లో గిట్టుబాటయ్యే పంటల సాగుపై అవగాహన కల్పించడం, ఆధునిక సాగుపద్ధతులను వివరించడం, నూతన వంగడాలను పరిచయడం చేయడం, చీడపీడల నివారణ పద్ధతులు తెలియజేయడం, సేంద్రియ, ప్రకృతివ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం వంటివి పొలం పిలుస్తోంది కార్యక్రమ లక్ష్యాలు. ఆచరణలో ఇవేవీ కనిపించడం లేదు.
● హాజరుకాని అధికారులు
పొలం పిలుస్తోంది కార్యక్రమానికి వ్యవసాయ శాఖతో పాటు ఆత్మ, సెరీ కల్చర్, ఉద్యానశాఖ, పశుసంవర్థక శాఖ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్, ఏపీసీఎన్‌ఎఫ్, కో ఆపరేటివ్ ఫెడరేషన్, మత్స్య, మార్కెటింగ్, ఇరిగేషన్, విద్యుత్, ప్రకృతి వ్యవసాయం తదితర సుమారు పది శాఖల అధికారులు విధిగా హాజరుకావాలి. వాస్తవంగా మండలంలో వ్యవసాయశాఖ అధికారులు మాత్రమే హాజరవుతున్నారు. కొన్నిచోట్ల మిగిలిన శాఖల అధికారులు హాజరవుతున్నా ఫొటోలు దిగివెళ్లిపోతున్నారని, సూచనలు ఇవ్వడం లేదని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
● నీరుగారుతున్న లక్ష్యం..
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించి రైతులకు ఉన్న సందేహాలను నివృత్తిచేయాలి. ప్రతి మంగళవారం, బుధవారాల్లో ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు వ్యవసాయ, అనుబంధ శాఖ ల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను పరిశీలించి సూచనలు చేయాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో అనుకున్న రీతిలో కార్యక్రమం జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఇటీవల రామభద్రపురం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పొలంపిలుస్తోంది కార్యక్రమాలే నిలువెత్తు సాక్ష్యం. జన్నివలసలో మంగళవారం నిర్వహించాల్సిన పొలంపిలుస్తోంది కార్యక్రమం నాగుల చవితి కారణంగా నిర్వహించలేదు. బుధవారం రొంపల్లి సచివాలయం పరిధిలో వంగపండువలసలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభించి మద్యాహ్నం 1 గంట వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని 11 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.15 గంటలకు పూర్తిచేసి వ్యవసాయాధికారులు మండల కేంద్రానికి చేరుకున్నారు. గొల్లపేటలో మధ్యాహ్నం 2.15 గంటలకు పొలంపిస్తోంది కార్యక్రమం ప్రారంభించి 3.45 గంటలయ్యేసరికి రైతులతో సదస్సు నిర్వహించడం, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడం పూర్తిచేసేసి ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉందంటూ వెళ్లిపోయారు. రూ.లక్షల ప్రజాధనంతో నిర్వహిస్తున్న కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంలేదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
నామమాత్రంగా అవగాహన సదస్సులు
హాజరుకాని అనుబంధ శాఖల
అధికారులు
రైతుల నుంచి స్పందన కరువు
రైతులకు ఉపయోగపడేలా నిర్వహించాలి
పొలం పిలుస్తోంది కార్యక్రమం పక్కగా నిర్వహించాలి. మొక్కుబడిగా కాకుండా రైతులకు ఉపయోగపడేలా ఉండాలి. గ్రామంలో కార్యక్రమం నిర్వహించే ముందు రోజు దండోరా వేసి రైతులకు తెలియజేయాలి. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి. ప్రతి రోజు ఉన్నతాఽధికారులకు నివేదికలు పంపించాలి. కార్యక్రమాలను ఆకస్మికంగా పరిశీలిస్తాం. లోపాలు గుర్తించి చర్యలు తీసుకుంటాం.
– వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయాధికారి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment