ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి
విజయనగరం అర్బన్: మరుగుదొడ్డి... ఆత్మ గౌరవానికి చిహ్నమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. మరుగుదొడ్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19 నుంచి డిసెంబర్ 10 వరకు హమారా సౌచాలం–హమారా సమ్మాన్ నినాదంతో జిల్లా అంతటా రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. సామూహిక మరుగుదొడ్లు వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు కృషిచేయాలన్నారు.అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఉమాశంకర్, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సూర్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి, డీపీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 530 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌లు
స్వచ్ఛభారత్ మిషన్ కింద జిల్లాలో 530 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌లు మంజురైనట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. వీటిలో 139 పూర్తి కాగా 190 పురోగతిలో ఉన్నాయని, 201 ప్రారంభం కావాల్సి ఉందన్నారు. పూర్తయిన మరుగుదొడ్లన్నీ వినియోగం లో ఉండేలా చూడాలని ఎస్‌ఈని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో నీరు, పారిశుద్ధ్య మిషన్ జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సామూహిక మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓకు సూచించారు. జల్‌జీవన్ మిషన్ పనులపై ఆరా తీశారు. తాగునీటి స్వచ్ఛత పరిశీలనకు గజపతినగరంలో కొత్తగా ల్యాబ్ ఏర్పాటుకు డీఓకు లేఖరాయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈకు సూచించారు. భూగర్భ జలాలు 10 అడుగుల్లోనే ఉన్నందున బోర్ వెల్స్ ద్వారా రబీ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ జేడీ తారకరామారావుకు సూచించారు. రైతులకు బోరుబావులు ఎక్కువగా మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీపీఓ వెంకటేశ్వరరావు, భూగర్భ జల, డీఆర్‌డీఏ, అటవీశాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment