విద్యార్థులకు పరీక్షా సమయం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పరీక్షా సమయం

Published Wed, Dec 25 2024 1:06 AM | Last Updated on Wed, Dec 25 2024 1:06 AM

విద్య

విద్యార్థులకు పరీక్షా సమయం

ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. శాఖాపరమైన ఉన్నతాధికారుల సూచనలతో సంకల్ప్‌ కార్యక్రమం ప్రతి కళాశాలలో అమలయ్యేలా చర్యలు చేపడుతున్నాం. క్షేత్రస్థాయిలో జూనియర్‌ కళాశాలలను పర్యవేక్షించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో సరైన బోధన, శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణత పెంచేందుకు కృషి చేస్తున్నాం.

– దుంగ మంజులవీణ,

ఇంటర్‌మీడియట్‌ జిల్లా విద్యాఽధికారిణి

శతశాతం ఫలితాల సాధనకు

‘సంకల్పం’

విడుదలైన పరీక్షల షెడ్యూల్‌..

మార్చిలో నిర్వహణ

జిల్లాలో 84 కళాశాలల నుంచి 17,403 మంది పరీక్షలకు సంసిద్ధం

పాలకొండ రూరల్‌: సగటు విద్యార్ధికి ఇంటర్‌మీడియట్‌ విద్య కీలక దశ. ఇక్కడే అధిక సంఖ్యలో విద్యార్థులు వెనుకబడి పోతుంటారు. ఈ పరిస్థితిని అధిగమించి ఉత్తమ ఫలితాల సాధనకు రాష్ట్ర ఇంటర్‌మీడియట్‌ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థుల హాజరుపెంపుతో పాటు వ్యక్తిగత ప్రమాణాలను పెంచేలా చర్యలకు ఉపక్రమించింది. ఈ విద్యా సంవత్సరం పార్వతీపురం మన్యం జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన 84 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం 8968మంది, ద్వితీయ సంవత్సరం 8435 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటి నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులు తప్పనిసరిగా కళాశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, ప్రతి విద్యార్ధిపై దృస్టి పెట్టాలని డీఐఈఓ జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు.

పాఠ్యాంశాల వారీగా..

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు మూడు నెలల సమయం ఉండడంతో విద్యాశాఖాధికారులు పాఠ్యాంశాల వారీగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రస్తుత నెలలో పరీక్షలు నిర్వహించి ప్రతి విద్యార్థి స్థాయిని అంచనా వేయనున్నారు. వెనుకబడిన వారిని, ముందున్న వారితో సనూనం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుని రెండో నెలలపాటు ఈ విధానం అమలు చేయనున్నారు. ఇలా పబ్లిక్‌ పరీక్షల సమయం వరకు అందరూ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

శ్రద్ధగా చదువుకునేలా..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను బృందాలుగా విభజించి, ఒక్కో బృందం బాధ్యతలను ఒక్కో అధ్యాపకుడితో అనుసంధానం చేశారు. విద్యార్థులు రోజూ కళాశాలకు వచ్చేలా, అన్ని పాఠ్యాంశాల్లో ఉత్తీర్ణత సాధించేలా చేయడం ఆ అధ్యాపకుడి బాధ్యతే. ఇందులో భాగంగా కళాశాలలోనే కాకుండా ఇంటికి వెళ్లిన తర్వాత చదువుకునేలా ఉదయం త్వరగా నిద్రలేచేలా చూస్తున్నారు. ఆ సమయంలో చదువుకుంటున్నారా లేదా అనే అంశాన్ని సెల్‌ ఫోన్‌ ద్వారా వాకాబు చేస్తున్నారు. స్థానికంగా ఉంటే నివాసాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ఉండడంతో పాటు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రతి కళాశాలలో ఒక అధ్యాపకుడిని కౌన్సిలర్‌గా నియమించారు.

సంకల్ప్‌ కార్యక్రమం..

ప్రతి జూనియర్‌ కళాశాలలో ఉత్తీర్ణత పెంచేందుకు సంకల్ప్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో విద్యార్థులను వారి అభ్యసన సామర్థ్యం, అక్టోబర్‌లో నిర్వహించిన క్వార్టర్లీ పరీక్షల్లో మార్కుల ఆధారంగా 3 కేటగిరీలుగా విభజిస్తారు. మెరుగైన విద్యార్థులను ఎ కేటగిరీ, మధ్యస్థంగా ఉన్న వారిని బి కేటగిరీ, తక్కువ మార్కులు వచ్చిన వారిని సి కేటగిరీగా విభజిస్తారు. అర్ధ సంవత్సరం పరీక్షలు, ప్రీ ఫైనల్స్‌ పరీక్షల మార్కులను ఆధారంగా వారి కేటగిరీల్లో కూడా మార్పులు చేస్తారు. మధ్యాహ్నం 3గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేకశిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యార్థులకు పరీక్షా సమయం1
1/1

విద్యార్థులకు పరీక్షా సమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement