మక్కువకు ప్రయాణం సాహసమే
సాలూరు: సాలూరు నుంచి బాగువలస మీదుగా మక్కువకు ప్రయాణమంటే ప్రజల గుండెల్లో గుబులు రేగుతుంది. గోతులు, గుంతలతో ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే నరకయాతనగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గం గుండా ప్రయాణమంటే సాహసమేనని ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఏర్పడింది. పెద్దపెద్ద గుంతల్లో దిగిపోయి లారీల వంటి పెద్ద వాహనాలు పాడైపోతుండగా, ద్విచక్రవాహనాలు పొరపాటున ఈ గుంతల్లో దిగుతూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ గోతుల్లో వర్షపునీరు నిండిపోవడంతో గుంతల లోతు అంచనా వేయలేక పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
మక్కువ రోడ్డుకు మోక్షపెప్పుడో ?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక కృషితో సాలూరు నుంచి మక్కువ వరకు 19.60 కి.మీ రోడ్డు వెడల్పు, పటిష్ట పరిచేందుకు సుమారు రూ.55 కోట్ల 56 లక్షల అంచనా విలువతో ఈ రోడ్డు మంజూరైంది. రూ.38 కోట్ల 52 లక్షల పని విలువతో ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో 2021 మార్చి 1వ తేదీన ఈ రోడ్డు పనులు ప్రారంభించారు. పనుల్లో భాగంగా 6 కి.మీ మెటల్ లేయర్ వేశారు. 32 కల్వర్టులకు గాను 16 కల్వర్టులు, 8 మైనర్ బ్రిడ్జిలకు గాను 3 బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులు చేపట్టాల్సి ఉంది.
రోడ్డు నిర్మాణం పూర్తిచేయరా?
ఇకనైనా ప్రభుత్వం, అఽధికారులు స్పందించి ఈ రోడ్డునిర్మాణం పూర్తి చేయించి తమ రహదారి కష్టాలు తీర్చాలని సాలూరు,మక్కువ మండలాల ప్రజలు కోరుతున్నారు.ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఈ మార్గం గుండా కాకుండా సాలూరు నుంచి మామిడిపల్లి, శంబర మీదుగా మక్కువకు ప్రయాణించిన విషయం పాఠకులకు విదితమే.
గుండెల్లో గుబులు రేపుతున్న
బాగువలస మీదుగా ప్రయాణం
అధ్వానంగా తయారైన రోడ్డు
Comments
Please login to add a commentAdd a comment