ఈవీఎం గోదాముల తనిఖీ
నెల్లిమర్ల: స్థానిక ఈవీఎం గోదాములను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శుక్రవారం తనిఖీ చేశారు. గోదాములకు, లోపలి జి–4, 6 గదులకు వేసిన సీళ్లను తెరిపించి పరిశీలించారు. అనంతరం సీళ్లు వేయించారు. ఈవీఎం గోదాముల పక్కన ఉన్న కేజీబీవీ పాఠశాల ఆవరణలో నీరు నిల్వఉండకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ డి.కీర్తి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కరరావు, నెల్లిమర్ల తహసీల్దార్ పి.సుదర్శన్ , ఎన్నికల డీటీ వీవీఆర్ జగన్నాథరావు, వివిధ పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జమ్ములో మరో మూడు డయేరియా కేసులు
గుర్ల: మండలంలోని జమ్ములో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజుల కిందట ఆరు డయేరియా కేసులు నమోదు కాగా శుక్రవారం మరో మూడు డయేరియా కేసులు నమోదయ్యాయి. డయేరియా భారిన పడిన తాడ్డి లక్ష్మి , జమ్ము కిత్తమ్మ, జమ్ము పార్వతి చీపురుపల్లి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. నాగళ్లవలసలో నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. వీరు చికిత్స ఆనంతరం కోలుకున్నట్టు వైద్యులు చెబుతున్నారు. తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి సర్పంచ్ గొర్లె నరసింహమూర్తితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.
లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి
● జిల్లా ఖజానాశాఖ అధికారి ఆర్‌ఏ కుమార్
విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల నుంచి లైఫ్ సర్టిఫికెట్లను జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు సబ్ ట్రెజరీలు, జిల్లా ట్రెజరీలో స్వీకరిస్తామని జిల్లా ఖజానా అధికారి ఆర్.ఎ.కుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో బయోమెట్రిక్ విధానంలోనూ సర్టిఫికెట్లు సమర్పించవచ్చన్నారు. జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా కూడా జీవన ధ్రుపత్రాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు. పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయడంలో సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
1వ తేదీ వరకు సంతాప దినాలు
విజయనగరం అర్బన్: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచికంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి జనవరి 1వ తేదీ వరకు వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాస మూర్తి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు సంతాప దినాలను పాటించాలని పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఐటీఐ ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న డొమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీ గిరి శుక్రవారం తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండి ఇంటర్మీడియట్, ఆపై చదువులు చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, రెండు ఫొటోలతో వీటీ అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐను సంప్రదించాలని కోరారు. ఈనెల 30వ తేదీ లోపు అభ్యర్థులు ఫార్‌మ్స్.జీఎల్‌ఈ అనే లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సెల్: 778065 8035, 98491 18075 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment