పారదర్శకంగా కానిస్టేబుల్ శారీరక దారుఢ్య పరీక్షలు
దళారీల మాట నమ్మి మోసపోవద్దు
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పీఎంటీ, పీఈటీ పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు ఎస్పీ వకుల్‌జిందాల్ సూచించారు. ఎవరైనా ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజయనగరం క్రైమ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు రి క్రూట్‌మెంట్ బోర్డు ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో స్టైఫండరీ సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ (మహిళలు/పురుషులు), ఏపీఎస్పీ పురుషులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ పరీక్షలకు వేళయింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 22 వరకూ విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాలో 9152 మంది అభ్యర్థులకు (పురుషులు 7,568, మహిళలు 1584) పీఎంటీ, పీఈటీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఎస్‌ఎల్‌పీఆర్‌బీ నుంచి డౌన్‌లోడు చేసుకున్న హాల్‌టికెట్లతో తమకు కేటాయించిన తేదీన, ఉదయం 4 గంటలకు విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు హాజరుకావాలని కోరారు. అభ్యర్థులు తమతో పాటు విద్యార్హతలు తెలిపే టెన్త్, ఇంటర్, కుల ధ్రువీకరణ పత్రం, నేటివిటీ, స్టడీ ఒరిజినల్స్ తీసుకురావాలన్నారు.
వెరిఫికేషన్ కోసం గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేసిన జెరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురాని అభ్యర్థులను తిరస్కరిస్తామని స్పష్టంచేశారు. ఏదైనా కారణంతో ఒరిజినల్స్ తీసుకురావడంలో విఫలమైతే మరో రోజున సర్టిఫికేట్స్ తీసుకుని, పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. మహిళా కానిస్టేబుల్ ఉద్యోగాలకు పీఎంటీ, పీఈటీ పరీక్షలను జనవరి 3, 4, 6 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులకు ముందుగా 1600 మీటర్ల పరుగు నిర్వహిస్తామని, అందులో అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 100 మీటర్ల పరుగు లేదా లాంగ్ జంప్ ఈవెంట్‌లో ఒకదానిలో అర్హతసాధించినా, తదుపరి రాత పరీక్షకు అర్హత సాధించినట్లుగా పరిగణిస్తామన్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 1600 మీటర్ల పరుగు అర్హత పరీక్షతో పాటూ, 100 మీటర్లు, లాంగ్ జంప్ రెండు ఈవెంట్స్‌లోనూ తప్పనిసరిగా అర్హత సాధించాలని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల నిఘా మధ్యన దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
డిసెంబర్ 30 నుంచి జనవరి 22
వరకు నిర్వహణ
జిల్లాలో 9,152 మంది అభ్యర్థులకు
పరీక్షలు
దళారీల మాట నమ్మి మోసపోవద్దు: ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment