బిల్లుల భారం భరించలేం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే.. వినియోగదారులు భరించలేని విధంగా విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. ప్రజా గొంతుకగా మారి.. నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం పోరుబాట పట్టారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన చంద్రబాబు.. మాట తప్పి, ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. తక్షణమే చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు పోరుబాట తప్పదని హెచ్చరించారు. – సాక్షి ప్రతినిధి, విజయనగరం
● నెల్లిమర్లలో గరంగరం
కూటమి ప్రభుత్వానికి నెల్లిమర్ల నియోజకవర్గంలో సెగ తగిలింది. నెల్లిమర్లలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలపై పోరుబాటలో భాగంగా తొలుత మొయిద కూడలి నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. బడ్డుకొండ ప్రదీప్, అంబళ్ల శ్రీరాములునాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఏడీకి వినతిపత్రం సమర్పించారు. అలాగే, భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, విద్యుత్ వినియోగదారులు భోగాపురంలో పోరుబాట నిర్వహించారు. పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, పతివాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కూటమి నేతలు ప్రజలను మోసగించారంటూ నినదించారు.
● ప్రజాగ్రహంలో కొట్టుకుపోతారు
● చంద్రబాబువన్నీ మోసాలే....
అధికార దాహంతో ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన చంద్రబాబు, ఇతర కూటమి నేతలు తీరా పీఠం దక్కాక ప్రజలకు బాదుడేబాదుడు ఎలా ఉంటుందో రుచిచూపిస్తున్నారని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఆరునెలల కాలంలో ఓ వైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. మరోవైపు కూటమి ప్రభుత్వం విద్యుత్‌వాత పెడుతుండడంపై మండిపడ్డారు. ఆరు నెలల కాలంలో వినియోగదారులపై రూ.15వేల కోట్ల విద్యుత్‌భారం మోపడం విచారకరమన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి చీపురుపల్లిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్ల ప్రధాన రహదారిలో వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి ఆర్‌ఈసీఎస్ ప్రధాన కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ ఆందోళన చేశారు. తక్షణమే విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఏపీఈపీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ రమణకు వినతిపత్రం అందజేశారు.
విజయనగరంలో నిరసన హోరు
కరెంట్ చార్జీల బాదుడుపై విజయనగరం జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ హోరెత్తింది. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలనే డిమాండ్‌తో తొలుత దాసన్నపేట రింగ్‌రోడ్డులోని కాళికామాత ఆలయం నుంచి విద్యుత్ భవనం వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. మాట తప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నగర మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టి వీరవెంకట రాజేష్, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఆరునెలలు గడవకముందే రూ.15వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నెత్తిన మోపిందని, ప్రజాగ్రహంలో ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ గజపతినగరంలో నిరసన ప్రదర్శన చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఏడీకి వినతిపత్రం అందజేశారు.
కూటమి ప్రభుత్వ తీరుపై
వినియోగదారుల్లో వెల్లువెత్తిన నిరసన
నియోజకవర్గాల కేంద్రాల్లో
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు
పెంచిన చార్జీలు తగ్గించాలనే
డిమాండ్‌తో అధికారులకు
వినతిపత్రాలు
తగ్గించేవరకూ వైఎస్సార్‌సీపీ పోరాటం: మజ్జి శ్రీనివాసరావు
అధికార పీఠం దక్కాక ఎన్నికల హామీ హుష్‌కాకి: శంబంగి
Comments
Please login to add a commentAdd a comment