శతశాతం ఫలితాలే లక్ష్యం
రేగిడి: ప్రభుత్వ గురుకులాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన ప్రణాళిక అమలుచేస్తున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కోఆర్డినేటర్ ఎస్.రూపవతి అన్నారు. ఉంగరాడమెట్ట వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులకు మంగళవారం నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వి.ప్రసన్నవెంకటేష్ ఆదేశాల మేరకు వర్క్ షాపులు నిర్వహిస్తున్నామన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి సులభ పద్ధతుల్లో బోధించాలన్నారు. గణితం, సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల బోధనపై సూచనలు చేశారు. రెండు జిల్లాల్లోని 13 గురుకులాల నుంచి ఈ ఏడాది 1,006 మంది పదోతరగతి విద్యార్థులు, 600 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. వీరందరూ ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులు బోధన సాగించాలని సూచించారు. ఇది పరీక్షల కాలమని, సమయం వృథా చేయకుండా విద్యార్థులు అభ్యసనపై దృష్టిసారించేలా చూడాలన్నారు. రాయడం, ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంపై సూచనలు చేయాలన్నారు. విజయనగరం జిల్లా వీఎమ్‌పేట బాలికల గురుకుల పాఠశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన వర్క్‌షాపు బుధవారం నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణలో 123 మంది గురుకుల బోధన సిబ్బందితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
పాలకొండ గురుకులం భేష్
ఉమ్మడి విజయనగరం జిల్లాలో పాలకొండలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో బోధన మెరుగ్గా సాగుతోందని, అక్కడి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్టు గురుకుల కోఆర్డినేటర్ ఎస్.రూపవతి అన్నారు. వర్క్‌షాపు అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. బోధనతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధచూపడం వల్ల మంచి ఫలితాలతో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. బాలికల గురుకుల పాఠశాలలకు సంబంధించి చీపురుపల్లి గురుకులం పనితీరు బాగుందన్నారు. బాలికల హాజరుశాతం, గురుకులాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఐఐటీ, నీట్‌కు సిద్ధమయ్యే గురుకుల విద్యార్థుల కోసం విజయనగరంలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. విద్యార్థుల
బంగరు భవితే తమ లక్ష్యమన్నారు.
ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్ రూపవతి
గురుకులాల బోధకులకు వర్క్‌షాపు
Comments
Please login to add a commentAdd a comment