ఫైలేరియా మాత్రల పంపిణీ శతశాతం జరగాలి
విజయనగరం ఫోర్ట్: ఫైలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా వచ్చేనెల 10 నుంచి 15 రోజుల పాటు గుర్ల మండలంలో డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ శతశాతం జరగాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. మైక్రో ఫైలేరియా కేసుల సంఖ్య గుర్ల మండలంలో ఎక్కువగా బయటపడడంతో ఆ మండలంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్ల మండలంలో సుమారు 16 వేల ఇళ్లు ఉన్నాయని, ప్రతి ఇంటికీ ఫైలేరియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ముద్రించిన స్టిక్కర్లను, కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. మండలంలో 67 వేల జనాభాలో రెండేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మినహా ప్రతిఒక్కరి చేతా డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలన్నారు. దీనికోసం ముందుగానే మండలంలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా మాత్రలను మింగించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవన రాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, డీఎల్‌ఓ డాక్టర్ రాణి, డీఎంఓ మణి, డీఈఓ మాణిక్యంనాయుడు పాల్గొన్నారు.
కలెక్టర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment