డీఎఫ్‌ఓ బాధ్యతల స్వీకరణ
విజయనగరం పూల్‌బాగ్: జిల్లా అటవీశాఖాధికారిగా ఆర్.కొండలరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. కొండలరావు రాజమండ్రి సర్కిల్ నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తా నని తెలిపారు. నగర వనాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. డీఎఫ్‌ఓకు ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్లు బి.అప్పలరాజు, వీవీఎస్‌ఎన్ రాజు, టి.త్రినాథరావు, సింధు, డీఆర్వోలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు శుభాకాంక్షలు తెలిపారు.
వేతనదారులందరూ పనులకు హాజరు కావాలి
● కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న వేతనదారులంతా తమ గ్రామాల్లో వెంటనే పనులకు హాజరు కావాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లోని 775 పంచాయతీల్లో పనులు ప్రారంభించామన్నారు. ప్రతిరోజూ 300 వేతనం పొందేలా పనిచేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ పనులైన ఫారంపౌండ్లు, బౌండరీ ట్రెంచ్‌లు, రింగ్ ట్రెంచ్‌లకు ప్రాధాన్యమివ్వాలని, చిన్న,సన్న కారు రైతుల మెట్ట భూముల్లో పండ్ల తోటలు, గడ్డి, పట్టు పురుగులు, పూల పెంపకం పనులు చేసుకోవాలన్నారు.
పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు
విజయనగరం క్రైమ్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్‌సెల్‌ను మార్చి 8వ తేదీవరకు రద్దుచేస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే గ్రీవెన్స్‌ను తిరిగి నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ అప్పటివరకు ఫిర్యాదులు అందజేసేందుకు రావద్దని కోరారు.
ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంపు
● పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె.మీనాకుమారి
విజయనగరం అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు లక్ష్యం చివరి దశకు వచ్చిందని, కొన్ని ప్రాంతాల్లో ఇంకా లక్ష్యానికి మించి రైతుల వద్ద ధాన్యం ఉండడంతో కొనుగోలు లక్ష్యాన్ని మరో 10 వేల మెట్రిక్ టన్నులకు ప్రభుత్వం పెంచిందని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె.మీనాకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖరీఫ్ 2024–25 సీజన్‌లో జిల్లాలోని 507 రైతు సేవా కేంద్రాల ద్వారా 3.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో మిగిలి ఉన్న ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు.
ఉద్యోగినికి న్యాయం చేయండి
● ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు విన్నవించిన నిమ్మక జయరాజ్
విజయనగరం అర్బన్: వీరఘట్టం మండలం చిన్నగోర కాలనీ గ్రామ సచివాలయంలో విధులు నిర్వహించే గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శి మండంగి బాలాకుమారికి పోస్టింగ్‌తో పాటు నాలుగు నెలల వేతనం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావుకు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ విన్నవించారు. గిరిజన ఉద్యోగినితో కలిసి ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను విజయనగరంలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం కలిశారు. బాలాకుమారికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఉద్యోగినికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గిరిజన గ్రామాల్లో తాగునీరు, రహదారుల సమస్యలు పరిష్కారానికి కూడా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment