చెరుకు కోతలు షురూ
ఉపాధి దొరుకుతుంది..
ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు కోతలు ప్రారంభం కావడంతో ఉపాధి దొరుకుతుంది. మేసీ్త్ర తీసుకెళ్లిన గ్రామాల్లో రోజు కోతలు చేపడుతున్నాం. జంటకు రూ.రెండు లక్షల నుంచి రూ.2.50 లక్షల అడ్వాన్సు ఇస్తున్నారు. కోతలు పూర్తయిన తర్వాత లెక్కగట్టి అప్పజెబుతాం.
– ఆనంద్, కోత కూలీ, ఎర్రగొండు పాలెం
సకాలంలో కోతలు
పూర్తి కావాలి..
అనుకున్న సమయానికి చెరుకు కోతలు పూర్తిగాకపోవడంతో రైతులు గతంలో ఇబ్బందులు పడ్డారు. ఈసారి అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కోత కార్మికులను ముందస్తుగా రప్పించి పంటల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కోతలు పూర్తి చేయాలి.
– నారాయణ, చెరుకు రైతు, సింగంపేట
కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 6,500 ఎకరాల్లో సాగు
అమరచింత: కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు కోతలు ప్రారంభమయ్యాయి. మూడురోజులుగా కోత కార్మికులు ఆయా గ్రామాల్లో పొలాల వద్దే స్థావరాలు ఏర్పాటు చేసుకొని కోత పనుల్లో నిమగ్నమయ్యారు. సకాలంలో కోతలు పూర్తి చేయాలన్న రైతన్నల కోరిక మేరకు యాజమాన్యం ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ సీజన్‌లో ఫ్యాక్టరీ పరిధిలో 6,500 ఎకరాల్లో చెరుకు సాగు చేశారు. ఈ మేరకు సుమారు 2 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేసుకున్న యాజమాన్యం.. అదనంగా రెండు లక్షల టన్నుల చెరుకును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని మొత్తం 4 లక్షల టన్నులు గానుగా ఆడించాలని నిర్ణయించింది. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు పంట సాగుపై రాయితీలు ఇస్తుండటంతో ఈసారి చెరుకు సాగుపై దృష్టి సారించారు. అలాగే మద్దతు ధర టన్నుకు రూ.3,366 చెల్లిస్తుండటంతో పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. మొత్తం 180 బ్యాచ్‌ల కోత కార్మికులను రప్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 100 బ్యాచ్‌లు వచ్చాయి. వీరితోపాటు ఫ్యాక్టరీకి చెందిన 7 కోత యంత్రాలతో పాటు ఒక ప్రైవేట్ కోత యంత్రాన్ని యాజమాన్యం సిద్ధం చేసింది. కోత కార్మికులంతా ఆంధ్రప్రదేశ్‌లోని ఎర్రగొండు పాలెం, మహారాష్ట్రా నుంచి వచ్చారు. టన్ను పంట కోతకు రైతుల నుంచి రూ.674 వసూలు చేస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 20 నుంచి 25 మంది కార్మికులు ఉంటారని ఫ్యాక్టరీ సిబ్బంది తెలిపారు. ఫ్యాక్టరీలో క్రషింగ్‌కు అదనంగా కార్మికులు అవసరం ఉండటంతో మరో 80 బ్యాచ్‌లను రప్పించే ప్రయత్నంలో యాజమాన్యం ఉంది. ఇందుకుగాను సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపించారు.
2 లక్షల టన్నుల దిగుబడికి అవకాశం
ఇతర ప్రాంతాల నుంచి
మరో 2 లక్షల టన్నులు దిగుమతి
సకాలంలో రైతులకు డబ్బుల చెల్లింపు
Comments
Please login to add a commentAdd a comment