పురం.. ఆర్థిక భారం
వనపర్తి టౌన్: వనపర్తి పురపాలిక కేవలం ఆస్తి పన్ను ఆదాయంపైనే ఆధారపడటంతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. సరిగ్గా 14 ఏళ్ల కిందటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. పుర జనరల్ ఫండ్ ఖాతాలో కనీస నిల్వలు లేక ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతోంది. జనరల్ ఫండ్ నిల్వలు తొలి ప్రాధాన్యతగా కార్మికులకు వేతనాలు ఇవ్వాలి. ఈ నిధులను గతంలో ఇష్టారీతిన దారి మళ్లించడం, పన్ను వసూళ్లలో వెనుకంజ, ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారించకపోవడంతో ఆర్థిక భారం నెలకొంది. నిబంధనల ప్రకారం జనరల్ ఫండ్ ఖాతాలో రూ.కోటి వరకు నిల్వ ఉండాలి. కానీ అలాంటి పరిస్థితి ఈ పురపాలికలో ఎనిమిది నెలలుగా కనిపించడం లేదు. పురపాలికలో కార్మికులు మొత్తం 236 మంది ఉన్నారు. వీరందరూ ప్రతి నెల వచ్చే వేతనంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరందరికి కలిపి ప్రతి నెల రూ.60 లక్షల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 19 వరకు జనరల్ ఫండ్‌లో కేవలం రూ.8 లక్షలు మాత్రమే ఉన్నాయి.
కార్మికుల ఆందోళన..
పదేళ్లుగా కార్మికులకు ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలిస్తూ వచ్చారు. గత ఆరు నెలలుగా వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కార్మికులు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్వచ్ఛ పురపాలికగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్న తమకు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, పిల్లల ఫీజులు, చిన్న చిన్న ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతున్నామని.. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. కార్మికుల బకాయి వేతనాలు చెల్లించకపోతే 21వ తేదీ కార్యాలయ దిగ్బంధం చేపట్టేందుకు కార్మిక సంఘం నాయకులు నిర్ణయించారు.
కావాల్సిన నిధులు
సుమారు
రూ. 60 లక్షలు
జనరల్ ఫండ్‌లో నిల్వ : రూ. 8 లక్షలు
నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న వనపర్తి పురపాలిక
కార్మికులకు వేతనాలు
చెల్లించలేని దుస్థితి
రేపు కార్యాలయ దిగ్బంధానికి
కార్మిక సంఘం నిర్ణయం
తీరని అన్యాయం..
కార్మికులకు వేతనాల చెల్లింపుపై పుర అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నెలవారి వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే కార్మికులకు గత ఆరునెలలుగా సకాలంలో అందడం లేదు. బుధవారం వేతనాలు ఇవ్వకపోతే గురువారం నుంచి కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తాం. అధికారులు, ఉద్యోగులు ఒకటో తేదీన వేతనాలు తీసుకుంటే కార్మికులకు చెల్లింపుల్లో చెల్లింపుల్లో జాప్యమెందుకు?
– పుట్టా ఆంజనేయులు,
పుర కార్మిక సంఘం ప్రతినిధి
చెల్లింపునకు చర్యలు..
పుర కార్మికులకు వేతనాలు త్వరగా చెల్లించేందుకు చర్యలు చేపట్టాం. ఈ మేరకు ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాం. గతంలో జనరల్ ఫండ్ నిధులను ఇష్టారీతిగా దారి మళ్లించడంతోనే ఈ దుస్థితి నెలకొంది. కార్మికులకు ప్రథమ ప్రాధాన్యతలో వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరగా వేతనాలు చెల్లిస్తాం.
– పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి
Comments
Please login to add a commentAdd a comment