వనపర్తివిద్యావిభాగం: విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని డీఈఓ గోవిందరాజులు అన్నారు. జిల్లాకేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్‌లో విద్యాశాఖ తరఫున గురువారం నుంచి మూడురోజుల పాటు నిర్వహించే జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనపై బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 350 ప్రదర్శనలు ఉంటాయని.. నిర్వహణ సక్రమంగా, సమన్వయంతో సాగేందుకు 15 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ‘సుస్థిర భవిష్యత్తు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై ప్రదర్శనలు ఉండాలని.. ఆహారం, ఆరోగ్యం, శుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సహజ వ్యవసాయం, రవాణా–కమ్యూనికేషన్, వనరుల నిర్వహణ, గణిత నమూనాలు, గణన ఆలోచనలు, విపత్తుల నిర్వహణ అనే ఏడు ఉప అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఇచ్చిన అంశాలు కాకుండా గైడ్ ఉపాధ్యాయులు తమ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులతో ప్రదర్శనలు చేయించేందుకు సమాయత్తం కావాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ప్రదర్శనలకు అనువుగా కేటాయించిన ప్రాంతాల్లో ఉండాలని, గైడ్ టీచర్లు ప్రదర్శనలను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైన్స్ ఫేర్ సమన్వయ కమిటీ బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment