మారనున్న పుర రూపురేఖలు
వనపర్తి
పట్టణ వ్యూ
వనపర్తిటౌన్: త్వరలోనే వనపర్తి పురపాలిక కొత్త మాస్టర్ ప్లాన్ అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పుర ఉన్నతాధికారులు చెబుతున్నారు. అమృత్ 2.0లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వారం రోజులుగా పుర పరిధిని సర్వే చేసేందుకు 16 పాయింట్లను గుర్తించడంతో పాటు డ్రోన్ ద్వారా సర్వే ప్రారంభించారు. ఇందుకు అవసరమైన సిబ్బంది, కావాల్సిన మ్యాపింగ్ వివరాలను పుర సిబ్బంది సర్వే అధికారులకు అందించారు. ఐదేళ్ల కిందటే అప్పటి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌కు అధికారికంగా ఆమోదం తెలిపినప్పటికీ విలీన గ్రామాల అంశం తెరపైకి రావడంతో మరుగునపడినట్లయింది. నిబంధనల ప్రకారం 1992లో రూపొందించిన బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ను 2011లోనే పునరుద్ధరించాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. కొత్త ప్రణాళిక అమలులోకి వస్తే పట్టణ రూపురేఖలు మారే అవకాశం ఉంటుంది.
ఎట్టకేలకు మోక్షం..
పట్టణం రోజురోజుకు విస్తరిస్తుండటంతో ప్రభుత్వం కొత్త బృహత్ ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. 1992లో రూపొందించిన ప్రణాళిక ఆధారంగా రహదారుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ అమలుకు సన్నాహాలు మొదలయ్యాయి. సర్వే పూర్తయిన తర్వాత మాస్టర్ ప్లాన్ అమలులో కీలక ఘట్టమైన వర్క్‌షాప్‌లో పుర అధికారులు బృహత్ ప్రణాళిక లక్ష్యాలను వివరిస్తారు. ఇందులో పాలక సభ్యులు, ప్రజల సూచనలు పరిగణలోకి తీసుకోనున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మ్యాప్‌ను తయారు చేయనున్నారు.
వనపర్తి మాస్టర్ ప్లాన్‌కు కసరత్తు
అమృత్ 2.0లో భాగంగా డ్రోన్ ద్వారా సర్వే
25 ఏళ్లకు అనుగుణంగా రూపకల్పన
విలీన గ్రామాలను కలుపుతూ హద్దుల నిర్ణయానికి ప్రయత్నాలు
అభివృద్ధికి దోహదం..
కొత్త మాస్టర్ ప్లాన్ అమలుతో వనపర్తి పుర రూపురేఖలు మారనున్నాయి. జిల్లాకేంద్రం కావడంతో భవిష్యత్‌లో పరిశ్రమలు వస్తే ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తిస్తారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి దోహదం చేసేందుకు మాస్టర్ ప్లాన్ ఉపయోగపడనుంది. అమృత్ 2.0లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను తీసుకొని మార్పులు, చేర్పులతో మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. ఇందుకు ఎంత సమయం పడుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం.
– పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి
Comments
Please login to add a commentAdd a comment