కేసీఆర్‌తోనే సస్యశ్యామలం
రూ. 4 వేల కోట్ల వ్యయంతో 6.50 లక్షల ఎకరాలకు నీరిచ్చాం..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ మంజూరు చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ పాలమూరు ఎత్తిపోతల. ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసి భూసేకరణ కాకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. అయినా సరే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ కృషి చేశారు’ అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తిస్వామిని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. 50 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు టీడీపీ ఈ జిల్లాకు తాగు, సాగునీరు ఇవ్వలేదు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చాం. కల్వకుర్తి, నెట్టెపాండు, బీమా, కోయిల్‌సాగర్ కింద రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లందించాం అని తెలిపారు. ఇంకా హరీశ్‌రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే..
కాంగ్రెస్, టీడీపీలు పాలమూరును వలసల జిల్లాగా మారిస్తే.. వలసలను వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీదే.. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు కట్టడం వల్ల భూగర్భజలాలు పెరిగి ఈ రోజు వ్యవసాయం పండుగగా మారింది. రైతుల క్షేమం కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన నాయకుడు కేసీఆర్.
పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చాం..
ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడాపూర్తిగా నెరవేర్చలేదు
మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితో కలిసి కురుమూర్తిస్వామికి మొక్కులు..
మార్గమధ్యంలో ధాన్యం కేంద్రాల్లో రైతులతో మాటామంతీ.. కొనుగోళ్ల తీరుపై ఆరా
పాలమూరు పేరును చెడగొడుతున్నారు..
రేవంత్‌రెడ్డికి వచ్చేది రెండే. ఒకటి దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం. మరొకటి ప్రతిపక్షాన్ని తిట్టడం. రైతులకు రూ.15 వేల రైతుబంధు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. అన్ని రకాల పంటలకు బోనస్ అంటూ మోసం చేశారు. రైతు కూలీలకు రూ.12 వేలు అంటూ ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయలు. కానీ పాలమూరు పేరును రేవంత్‌రెడ్డి చెడగొడుతున్నారు.
రేవంత్ సీఎం అయ్యారంటే
కేసీఆర్ భిక్షనే..
రైతులకు రూ.41 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ తర్వాత రూ.31వేల కోట్లు అని, అనంతరం బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు మాత్రమే పెట్టారు. చివరకు చేసింది ఎంత అంటే రూ.17 వేల కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి 20 లక్షల మందికి మాత్రమే చేశారు. సగం కంటే రుణ మాఫీ కాలేదు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. రైతులకు మేలు జరుగుతుందంటే నా ఎమ్మెల్యే పదవిని సైతం వదులు కోవడానికి సిద్ధపడ్డాను. కానీ పూర్తి రుణమాఫీ చేయ డంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉంది. ఈ రాష్ట్రానికి రేవంత్ సీఎం అయ్యావంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షనే. హైడ్రా మూసీ పేరుతో ఇళ్లను కూలగొట్టడమే తప్ప ఇల్లు కట్టడం తెలియదు రేవంత్‌రెడ్డికి.
ప్రజలపై ఆగ్రహం
చూపొద్దని మొక్కా..
కురుమూర్తి స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పాలకుడే దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే దైవాగ్రహానికి గురవుతాం. రేవంత్‌రెడ్డి చేసిన పాపానికి ఆ స్వామిని దర్శించుకుని క్షమించమని, ప్రజలపై ఆగ్రహం చూపొద్దని మొక్కా. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రాన్ని పాలించే పాలకుడు ప్రజలను మోసం చేయకుండా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించా. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు రావాలని కోరుకోవడం లేదు.. ఎప్పుడు వస్తే అప్పుడు 100 సీట్లతో కేసీఆర్‌ను గెలిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment