భారీగా బకాయిలు!
వనపర్తి పురపాలికలో ఆస్తిపన్ను వసూలు అంతంతే
రూ. 10వేల నుంచి
రూ. 8లక్షల దాక..
పురపాలికలో ఒక్కో యజమాని రూ. 10వేల నుంచి మొదలుకుని రూ. 8లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. మొండి బకాయిదారుల నుంచి పురపాలికకు సుమారు రూ. కోటి 80 లక్షలు రావాల్సి ఉందని అధికారు లు తేల్చారు. అందులో వ్యాపార, నివాస సముదాయాలతో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు, ఆస్పత్రుల నుంచి పన్ను రూపంలో ఆదాయం రావాల్సి ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం చివరలో మాత్రమే అధికారులు ఆస్తిపన్ను వసూలుపై హడావుడి చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. సకాలంలో పన్ను లను వసూలు చేయకపోవడంతో యజమానులతో పాటు మున్సిపాలిటీకి భారంగా మారుతోంది. ఒక్కో దశలో మున్సిపల్ ఖజానాలో నిధులు లేక కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుంది.
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రమైన వనపర్తి పురపాలికలో ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దశాబ్దాలుగా ఆస్తిపన్ను చెల్లించని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొండి బకాయిదారుల్లో కొందరు 3 నుంచి 30 ఏళ్ల దాక పన్ను చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాలతో బకాయిలను రాబట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. వనపర్తి మున్సిపాలిటీలో రెసిడెన్షియల్ 14,941, నాన్ రెసిడెన్షియల్ 1,365, మిక్స్‌డ్ భవనాలు 1,424లతో కలిపి మొత్తం 17,730 నివాసాలు, వ్యాపార దుకాణ సముదాయాలు ఉన్నాయి. అందులో 3,800 మంది యజమానులు మొండి బకాయిదారులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించక పోవడంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరడం లేదు. దీనికి తోడు ఆస్తిపన్ను వసూలు గడువు ముంచుకొస్తుండటంతో, లక్ష్యాన్ని చేరుకునేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే బకాయిదారుల వివరాలను బ్లాకుల వారీగా లెక్కేసిన అధికారులు.. పెండింగ్ ఆస్తిపన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు నోటీసుల జారీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి మొండి బకాయిల వసూళ్లే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది.
రూ. 1.80 కోట్ల రాబడి పెండింగ్
కొందరు ఏళ్ల తరబడి చెల్లించని వైనం
మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment