అర్హుల ఎంపికకే గ్రామసభలు
కొత్తకోట రూరల్/ఖిల్లాఘనపురం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం మొదటిరోజు పెద్దమందడి మండలం చీకరచెట్టుతండా, ముందరితండా, ఖిల్లాఘనపురం మండలం ఉప్పరిపల్లిలో జరిగిన గ్రామసభల్లో కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులకే అందాలనే ఉద్దేశంతో అధికారులు ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో తిరిగి దరఖాస్తులు పరిశీలించి తుది అర్హుల జాబితా రూపొందించారని తెలిపారు. జాబితాలో ఏమైనా మార్పు చేర్పులుంటే గ్రామసభల్లో ప్రజాభిప్రాయాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన రూపొందించిన జాబితాను గ్రామసభలో పంచాయతీ కార్యదర్శి చదివి వినిపిస్తారని చెప్పారు. అనర్హులుంటే అభ్యంతరం చెప్పాలని, జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. అదేవిధంగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియని.. గ్రామసభలో, ప్రజాపాలన సేవాకేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. నిజమైన లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందే విధంగా పార్టీలకతీతంగా, పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా జనవరి 26న ముఖ్యమంత్రి మరో 4 సంక్షేమ పథకాలు పథకాలు ప్రారంభించబోతున్నారన్నారు. ఆసరా పింఛన్ రూ.4 వేలకు పెంచడం, పేద మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం హామీలు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ.. అర్హులకే సంక్షేమ పథకాలు అందాలనే గ్రామసభలు నిర్వహిస్తున్నామని, ఏమైనా అభ్యంతరాలుంటే చె ప్పాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు,పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment