‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● పాఠశాలలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
● మోడల్ పాఠశాలలో
దొడ్డు బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించడంపై ఆగ్రహం
ఖిల్లాఘనపురం: పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శనివారం మండలంలోని దొంతికుంటతండా స్టేజీ సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాల, మండల కేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, సరుకుల నాణ్యత, పాఠశాలల పరిసరాలు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. మార్చి 21 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయని.. విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా సిద్ధం చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. మోడల్ పాఠశాలలో దొడ్డురకం బియ్యంతో మధ్యాహ్న భోజనం వండటంతో ప్రిన్సిపల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం వండిన తర్వాత సూపర్‌వైజర్లు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలన్నారు.
ఉగాది వరకు పూర్తి చేయాలి..
మండలంలోని మామిడిమాడలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను శనివారం కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఉగాది నాటికి నిర్మాణాలు పూర్తి చేసేలా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్‌శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ మల్లయ్య, తహసీల్దార్ సుగుణ, ఎంపీడీఓ వెంకటాచారి, ఎంఈఓ జయశంకర్, సింగిల్‌విండో డైరెక్టర్ సాయిచరణ్‌రెడ్డి, బాలీశ్వర్‌రెడ్డి, ఏఈ రమేశ్‌నాయుడు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment