న్యాయవాద వృత్తి పవిత్రమైంది
● న్యాయవాదులు ధర్మంవైపు నిలబడాలి
● ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి: న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైందని.. న్యాయవాదులు ధర్మం వైపు నిలబడాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎస్‌డీఎం న్యాయ కళాశాలలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏదేని తప్పు జరిగినప్పుడు బాధితులు కోర్టును ఆశ్రయిస్తారని.. పూర్వాపరాలు విన్న న్యాయవాది నిజాయితీగా తప్పును చెప్పాలన్నారు. మహిళల భద్రతపై ప్రస్తావిస్తూ మహిళల రక్షణకు షీటీం ప్రత్యేకంగా పని చేస్తోందని.. విద్యార్థినులను వేధింపులకు గురిచేసినా, ర్యాగింగ్ చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాప్ తదితర ప్రాంతాల్లో ఎవరైనా వేధిస్తే షీటీం హెల్ప్‌లైన్ నంబర్ 63039 23211 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అదేవిధంగా వేధింపుల రకాలు, షీటీంను సంప్రదించే విధానం, గుడ్, బ్యాడ్ టచ్, విద్య ఆవశ్యకత, బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, పోక్సో తదితర వాటి గురించి వివరించారు. అనంతరం మొదటి, రెండో సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భాస్కర్, సీఐ కృష్ణ, షీటీం ఎస్‌ఐ అంజద్, షీటీం పోలీస్ సిబ్బంది శ్రీనివాసులు, కృష్ణ, శ్రీను, రమేశ్, ప్రొఫెసర్లు వెంకటసాయిప్రసాద్, విజయకుమార్, దర్గాస్వామి, కరుణాకర్, నర్మద, వినోద్‌రావు, నిఖిల్‌సాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి..
యువత తమ సమయాన్ని వృథా చేయకుండా కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేసి తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ, షీటీం సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల దగ్గరకు వెళ్లి వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని, కుటుంబ ఆర్థిక స్థితిగతులను అవగాహన చేసుకోవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు విధిగా రహదారి నిబంధనలు పాటించాలని, విద్యార్థినులకు వేధింపులకు గురైతే షీటీంను సంప్రదించాలన్నారు.
71 మంది బాలకార్మికులకు విముక్తి..
ఆపరేషన్ స్మైల్–11 విడతలో జిల్లావ్యాప్తంగా 71 మంది బాలకార్మికులను గుర్తించామని.. అన్నిశాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశామని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ప్రతి ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి కిరాణం, మెకానిక్ దుకాణాలు, హోటళ్లు, వివిధ కంపెనిల్లో పనిచేస్తున్న, భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా స్టేట్ హోంకు తరలిస్తామన్నారు. ఆపరేషన్ స్మైల్–11లో 69 మంది బాలురు, ఇద్దరు బాలికలను పాఠశాలలో చేర్పించి వారిని పనిలో పెట్టుకున్న 8 మంది యజమానులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్‌ఐ, నలుగురు సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి విస్తృతంగా తనిఖీలు చేశామన్నారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఆయా శాఖల అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment