భవితతో మనోస్థైర్యం
ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక కేంద్రాలు
●
సమాజంలో
రాణించేలా ప్రోత్సాహం..
ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించేందుకు ఇంక్లూజిల్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ) ద్వారా ఏటా జనవరి, జూలైలో సర్వే నిర్వహిస్తాం. వారిని భవిత కేంద్రాల్లో చేర్పించేలా ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం జిల్లాలో 16 కేంద్రాలు.. 1,825 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి చదువుతో పాటు వారంలో ఒకరోజు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ క్యాంపు, ప్రతి శనివారం ఐఈఆర్పీలు నలుగురు దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి విద్యా కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రత్యేక అవసరాల విద్యార్థులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు.
– యుగంధర్, ఐఈ కో–ఆర్డినేటర్
గోపాల్‌పేట: తెలంగాణ ప్రభుత్వం సమగ్రశిక్ష అభియాన్ పథకంలో భాగంగా 18 ఏళ్లలోపు ప్రత్యేక అవసరాల పిల్లలందరికీ సమ్మిళిత విద్య అందిస్తోంది. పుట్టుకతో వైకల్యం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లల్లో మనోస్థైర్యం నింపేందుకు భవిత కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో వారికి నిత్యకృత్యాలతో పాటు బోధన, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, కృత్యోపకరణాల వినియోగం మెళకువలు నేర్పిస్తున్నారు. ఇటీవల డీఎస్సీలో ఎంపికై న ప్రత్యేక ఉపాధ్యాయులు కేటాయించిన పాఠశాలల్లో పనిచేస్తూ అవసరమైన చిన్నారుల ఇళ్లకు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు.
సమ్మిళిత లేదా సహిత విద్య..
సాధారణ, ప్రత్యేక అవసరాల విద్యార్థులను కలిపి వారి స్థాయిలకు అనుగుణంగా బోధించే విద్యనే సమ్మిళిత లేదా సహిత విద్య అని అంటారు. 21 రకాల వైకల్యాల విద్యార్థులను ప్రత్యేక అవసరాల విద్యార్థులుగా గుర్తించారు. జిల్లాలో 1,825 మంది ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను గుర్తించి వీరికోసం 16 భవిత కేంద్రాలు ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్స్ పనిచేస్తున్నారు. భవిత కేంద్రాల్లో స్కూల్ రెడీ న్యూస్ ప్రోగ్రాం అమలు చేస్తారు. ఇందులో ఆయా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధన అందించి సాధారణ విద్యార్థులతో పాటు పాఠశాలలో చేర్పించేలా తయారు చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ఉచిత ఉపకరణాల పంపిణీ..
ప్రతి ఏటా ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆర్టిఫీషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల పంపిణీ చేస్తారు. 2023–24 విద్యా సంవత్సరంలో జిల్లాలో 128 మంది పిల్లలకు సుమారు రూ.పది లక్షల విలువైన ఉపకరణాలు అందించారు. అలాగే వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థులకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ డిజబులిటీ సహకారంతో టీఎల్‌ఎం కిట్స్ అందిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలో 59 మంది విద్యార్థులకు టీఎల్‌ఎం కిట్లు పంపిణీ చేశారు. కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు గ్రహణమొర్రిలాంటి చిన్న చిన్న శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేయిస్తున్నారు.
ఇంటివద్దే బోధన..
జిల్లాలో 16 కేంద్రాలు ఏర్పాటు..
1,825 మంది చిన్నారుల గుర్తింపు
సాధారణ విద్యార్థులతో
పోటీపడేలా శిక్షణ
ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ శిబిరాలు
భవిత కేంద్రాలకు సైతం రాలేని స్థితిలో ఉన్న మానసిక, శారీరక వైకల్యం కలిగిన విద్యార్థుల ఇళ్లకు ఈఆర్పీలు వెళ్లి బోధన అందిస్తారు. ప్రతి శనివారం నలుగురు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రతి విద్యార్థికి గంట సమయం కేటాయించి వారి అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పద్ధతులను సూచిస్తారు. వారంలో ఒకరోజు ఫిజియోథెరపీ చేస్తారు. స్పీచ్ థెరపీ అవసరం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ పొందిన ఫిజియోథెరపీస్ట్, స్పీచ్ థెరపీస్ట్ ద్వారా క్యాంపు నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లాలో ఇద్దరు ఫిజియో థెరపీస్టులు, ఇద్దరు స్పీచ్ థెరపీస్టులు పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment