జీపీ కార్మికులకు మంచిరోజులు
ఇక నుంచి ఆన్‌లైన్ వేతన చెల్లింపులు
అమరచింత: గ్రామపంచాయతీల్లోని మల్టీపర్పర్స్ ఉద్యోగులకు ఇక నుంచి నెలవారి వేతనాలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంతవరకు గ్రామపంచాయతీ ఖాతాల్లో మిగులు ఆదాయం చూసి ఎంపీడీఓల ద్వారా వేతనాలు చెల్లించేవారు. దీంతో ప్రతినెల సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కార్మికులకు వేతనాలు అందించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకుగాను గత నెలలోనే గ్రామపంచాయతీల వారీగా కార్మికుడి వ్యక్తిగత బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో జాబితాను సిద్ధం చేసి జిల్లా పంచాయతీ అధికారికి, ఆ శాఖ కమిషనర్‌కు పంపించారు. ఇక వచ్చేనెల నుంచే వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయనే ఆశల్లో కార్మికులు ఉన్నారు. ఇన్నాళ్లు సకాలంలో వేతనాలు అందక కుటుంబ పోషణ కోసం అప్పులు చేసిన పంచాయతీ కార్మికులు ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి నెల రూ.9,500..
గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.9,500 వేతనం చెల్లిస్తోంది. అదికూడా సకాలంలో అందకపోవడంతో సంఘం పరంగా ఉద్యమాలు చేపడుతూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం నెలకు రూ.21 వేలు చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు.
జిల్లాలో 255 గ్రామపంచాయతీలు.. 1,080 మంది మల్టీపర్పర్స్
ఉద్యోగులు
గతంలో ఎంపీడీఓల ద్వారా జమ
ట్రెజరీ ద్వారా చెల్లింపులు..
ప్రతినెల వేతనాలు సకాలంలో అందక ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగేవాళ్లం. ఎంపీడీఓ కార్యాలయంలో వేతనాల బిల్లు చేసి ట్రెజరీకి పంపేవారు. అక్కడి నుంచి అకౌంట్లోకి వేతన డబ్బులు జమయ్యేవి. ఇలా నాలుగు, ఐదు నెలలకొసారి వేతనాలు ఇచ్చేవారు. ఆన్‌లైన్‌లో వేతనాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉంది.
– మల్లేష్, పారిశుద్ధ్య కార్మికుడు, నాగల్‌కడ్మూర్
సకాలంలో అందక ఇబ్బందులు..
గ్రామపంచాయతీ ఖాతాలో డబ్బులు లేవని నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. పలుమార్లు అధికారులకు విన్నవించగా గతేడాది నవంబర్ వరకు చెల్లించారు. ప్రభుత్వం జనవరి నుంచి వేతనాలు నేరుగా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని చెప్పడం సంతోషంగా ఉంది.
– సురేశ్, పారిశుద్ధ్య కార్మికుడు, పాంరెడ్డిపల్లి
ఉన్నతాధికారులకు నివేదించాం..
పంచాయతీ కార్మికులకు క్రమం తప్పకుండా ప్రతినెల వేతనాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలను అందజేశాం. – సురేశ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment